హైదరాబాద్లో పాత ఒక్క రూపాయి నోటుకు భారీ మొత్తం ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రూ.45 లక్షలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి నుంచి రూ.7.93 లక్షలకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19)లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాత ఒక్క రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇప్పిస్తామనే ఆశ చూపి బాధితుడి నుంచి మొత్తం రూ.7,93,351 వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే ఈ ఇద్దరు నిందితులు కేవలం ఈ ఒక్క మోసానికే పరిమితం కాలేదని పోలీసులు గుర్తించారు. అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, సిమ్ కార్డులను సేకరించి వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ఖాతాలను సైబర్ మోసాలకు పాల్పడే వ్యక్తులు వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులు అందించిన బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ లావాదేవీల వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, నేరాల వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హెచ్చరిక: పాత నోట్లు, అరుదైన కరెన్సీకి భారీ ధర చెల్లిస్తామనే ప్రకటనలను నమ్మి ముందుగానే డబ్బులు పంపవద్దు. అలాగే ఇతరులకు మీ బ్యాంకు ఖాతా వివరాలు, సిమ్ కార్డులను ఇవ్వడం వల్ల సైబర్ నేరాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
also read: ఏపీని ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా మారుస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
