అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్ భారత క్రికెట్ భవిష్యత్తుకు కొత్త ఆశలను నింపుతోంది. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన టీమిండియా మేనేజ్మెంట్, యువ ప్రతిభకు అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేసింది. ఆ నిర్ణయం ఫలితంగా పలువురు యువ ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసిన భారత్, వన్డే సిరీస్‌లో కూడా ఆధిపత్యం చాటుతూ ముందంజలో ఉంది. ఈ విజయాల వెనుక యువ ఆటగాళ్ల పాత్ర కీలకంగా నిలిచింది. అయితే అద్భుత ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడికి 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఖాయం అవుతుందనే పరిస్థితి కనిపించడం లేదు. జట్టులో ఉన్న తీవ్రమైన పోటీ, అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం కారణంగా కొందరు యువ ఆటగాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు హర్ష్ దూబే. ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో వచ్చిన అవకాశాన్ని హర్ష్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ధర్మశాలలో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. బౌలింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచినప్పటికీ, జట్టులో జడేజా, అక్షర్ వంటి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్లు ఉండటంతో అతనికి స్థిరమైన స్థానం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత హర్ష్ దూబే మళ్లీ నిరీక్షణ జాబితాకే పరిమితం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరో యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్. ఐపీఎల్ 2026లో 16 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వేగవంతమైన బౌలర్‌కు అఫ్గానిస్తాన్ సిరీస్‌లో జాతీయ జట్టులో చోటు లభించింది. ధర్మశాలలో అవకాశం రాకపోయినా, లక్నోలో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఒత్తిడిని అధిగమించి 56 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు సాధించడం ద్వారా తన ప్రతిభను నిరూపించాడు. అయితే అతని ముందు ఉన్న అసలు సవాలు జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లతో పోటీ పడటమే. బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్తో తిరిగి జట్టులోకి వస్తే అతని స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. దీంతో ప్రిన్స్ యాదవ్ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం సులభం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పంజాబ్‌కు చెందిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కూడా ఈ సిరీస్‌లో తన ప్రతిభను చాటుకున్న ఆటగాళ్లలో ఒకడు. టెస్టు, వన్డే రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్న గుర్నూర్, ధర్మశాల మరియు లక్నో వేదికలుగా జరిగిన మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తన ఎత్తును సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 ప్రపంచకప్ పరిస్థితులకు అతని బౌలింగ్ శైలి అనుకూలంగా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను పక్కన పెట్టి గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.
భారత జట్టులో స్థానం సంపాదించడం మాత్రమే కాదు, దానిని నిలబెట్టుకోవడం కూడా అత్యంత కఠినమైన సవాల్. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండిన జట్టులో యువ క్రికెటర్లకు అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. అఫ్గానిస్తాన్ సిరీస్‌లో హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ తమ ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ, 2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే మరింత నిలకడైన ప్రదర్శన అవసరం. ప్రస్తుతం సీనియర్ల అనుభవం, గత రికార్డులు, జట్టు సమతుల్యత వంటి అంశాలు వీరికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ క్రికెట్లో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం రాణిస్తే ఈ యువ ఆటగాళ్లు భవిష్యత్తులో భారత జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం మాత్రం కొట్టిపారేయలేం.
ALSO READ: సిగ్నల్ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ