Homeతెలంగాణకొండా ఫ్యామిలీ రాజకీయ దూకుడు...!

కొండా ఫ్యామిలీ రాజకీయ దూకుడు…!

  • ఆది నుంచి వారి వైఖరి అంతే

  • పనిచేసే పార్టీ నాయకత్వాలపై తిరుగుబాటు

  • గతంలో జగన్, కెసిఆర్ పై ఇదే మాదిరిగా

  • కాంగ్రెస్ వేటు వేస్తే ఒంటరి

  • చేర్చుకునేందుకు తెలంగాణలో పార్టీలు విముఖత

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం స్టైల్ ప్రత్యేకం. ఆది నుంచి ఆ ఫ్యామిలీ దూకుడు వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం పైనే నేరుగా బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తెలంగాణ కాంగ్రెస్ లో పెనుముసలానికి దారితీసింది.

పరకాల పర్యటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని సీఎం పిలుపునిచ్చిన వెంటనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తల్లి ఒక రాష్ట్ర మంత్రి కాగా.. తండ్రి సీనియర్ నాయకుడు. వారి ఆశీస్సులు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం అసాధ్యమని.. ఇదంతా కొండా దంపతుల వ్యూహాత్మక రాజకీయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • పరకాలలో పట్టు కోసం..

ఆది నుంచి పరకాలలో పట్టు బిగించాలన్నది కొండా ఫ్యామిలీ వ్యూహం. వచ్చే తరం రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునే తాపత్రయంలో భాగంగానే ఈ కఠిన వైఖరి అని తెలుస్తోంది. గతంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన మాట తప్పని ఆరోపిస్తూనే.. అదే పరకాల నుంచి తన కుమార్తెను రంగంలోకి దించాలని సురేఖతోపాటు భర్త మురళి కూడా ఆలోచన చేస్తున్నారు.

కానీ సీఎం రేవంత్ మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డికి పరోక్ష మద్దతు తెలపడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సీఎం రేవంత్ తో పాటు హై కమాండ్ ను బెదిరించి తమ రాజకీయ డిమాండ్లు సాధించుకోవాలన్నదే కొండా ఫ్యామిలీ వ్యూహంగా తెలుస్తోంది.

  • కాంగ్రెస్ పై అలిగితే అంతే

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొండా ఫ్యామిలీకి దిక్కు. ఎందుకంటే దాదాపు అన్ని పార్టీలను చూసింది ఆ ఫ్యామిలీ. గతంలో పనిచేసిన పార్టీ నాయకత్వాలతో విభేదాలు కొనసాగుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు కొండా సురేఖ, మురళీలు. ఆయనతో విభేదించి కెసిఆర్ పక్కన చేరారు.

అక్కడ మంత్రి పదవి అనుభవించి అదే కేసీఆర్ పై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అక్కడ మంత్రి పదవి పొందారు. ఇలా తరచూ పార్టీలు మారడం వారికి అలవాటు. క్రమశిక్షణ రాహిత్యంతో సొంత ప్రభుత్వాలతో పాటు పార్టీలపై తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అందుకే వారి విషయంలో ఇతర పార్టీలు అంత అనుకూలంగా లేవు కూడా. తెలంగాణ సర్కార్లు మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి వేటు వేస్తే కొండా ఫ్యామిలీ ఒంటరి కావడం ఖాయం.

  • నాకు సంబంధం లేదు: మంత్రి సురేఖ

మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ స్పందించింది. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై వివరణ ఇచ్చారు సురేఖ. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయా లేనని.. వాటితో పార్టీ పరంగా తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఆమె మాట్లాడిన మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. తాజాగా కొండా సురేఖ వివరణతో కాంగ్రెస్ పార్టీలో లోతైన చర్చ నడుస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు