కరీంనగర్, క్రైమ్‌మిర్రర్: రామగుండంలో రైలు ఎక్కి మేడారంలో మొక్కులు చెల్లించుకొని, ఆ తర్వాత భద్రాచలంలో రైలు దిగి రాముణ్ని దర్శించుకుంటే..? భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్లో రైలు ఎక్కి విశాఖపట్నంలో దిగి బీచ్‌లో ఎంజాయ్ చేసి.. మళ్లీ భద్రాచలం రోడ్ మీదుగానే రామగుండం వెళ్లిపోతే..? ఊహ భలే ఉంది కదా. కొత్తగా ఏర్పాటు కానున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌తోపాటు.. ఇప్పటికే రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భద్రాచలం రోడ్-కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటయితే ఈ కల త్వరలోనే సాకారం కానుంది.తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలను కలుపుతూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. మణుగూరు-రామగుండం కొత్త రైలు మార్గాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.5818.45 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంలో పూర్తి చేయనున్నారు. 207.8 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. మణుగూరు-రామగుండం మధ్య 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం మణుగూరు నుంచి రామగుండం వెళ్లడానికి భద్రాచలం రోడ్, కాజీపేట మీదుగా చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వస్తోంది.కొత్త రైల్వే అందుబాటులోకి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గిరిజనుల అతిపెద్ద జాతర జరిగే మేడారం ప్రాంతానికి రైలులో వెళ్లొచ్చు. మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, గోపాలరావుపేట మీదుగా ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు మార్గం న్యూఢిల్లీ-చెన్నై మార్గంలోని విజయవాడ-నాగ్‌పూర్ సెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
ప్రజా రవాణాతోపాటు బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు, ఖనిజాల ఎగుమతులకు ఈ రైల్వే మార్గం కీలకం కానుంది. పెద్దపల్లి, ములుగు జిల్లా ప్రజలు మేడారం, భద్రాచలం లాంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా వెళ్లడానికి వీలవుతుంది.ఏడాదిలోగా భూసేకరణ చేపట్టాలని.. మరో నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ, అనుమతులు, డీపీఆర్ రూపకల్పన లాంటి పనులను రైల్వే శాఖ చూసుకుంటుంది. రైలు మార్గం నిర్మాణం, నిధుల సమీకరణతోపాటు 45 ఏళ్లపాటు ఈ రైలు మార్గ నిర్వహణ బాధ్యతను ప్రయివేట్ సంస్థకు అప్పగిస్తారు. రైల్వే శాఖ పీపీపీ మోడల్‌కు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించిన తర్వాత టెండర్లను ప్రారంభిస్తారు.
ఈ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. భద్రాచలం నుంచి రామగుండం చేరుకోవడం సులభం అవుతుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం-పాండురంగాపురం వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయ్యింది. అలాగే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), డోర్నకల్ స్టేషన్ల మధ్య డబుల్ లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు భద్రాచలం రోడ్ నుంచి ఆంధ్రాలోని కొవ్వూరు వరకు రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలోని సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని బొగ్గు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు.
సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్ కోసం డీపీఆర్ సిద్ధమైంది. భద్రాచలం రోడ్-కొవ్వూరు లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.మరో 5-10 ఏళ్లలో ఈ మూడు రైల్వే మార్గాలు పూర్తయితే.. భద్రాచలం రోడ్ మీదుగా విశాఖ నుంచి రామగుండం, హైదరాబాద్ లాంటి నగరాలకు రైళ్లను నడపొచ్చు. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు.. ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలకు, ఒడిశాలోని గిరిజన ప్రాంతాలకు భద్రాద్రి జిల్లాలోని రైల్వే స్టేషన్లు జంక్షన్‌లా మారతాయి.రామగుండం రైల్వే స్టేషన్‌కు ఉత్తర భారతదేశంలోని న్యూఢిల్లీ, ఆగ్రా, లక్నో, వారణాసి, గ్వాలియర్, నాగ్‌పూర్, ముంబై లాంటి కీలక నగరాలతోపాటు.. సౌతిండియాలోని చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం లాంటి కీలక నగరాలతో రైల్వే పరంగా అనుసంధానం ఉంది. ఈ కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే రామగుండం నుంచి విశాఖపట్నం, రాజమండ్రి లాంటి నగరాలకు దూరం తగ్గడంతోపాటు కనెక్టివిటీ మెరుగవుతుంది.