HomeజాతీయంCM Vijay: సీఎం విజయ్ సోషల్ మీడియా పోస్టు వివాదం.. బీజేపీ తీవ్ర విమర్శలు!

CM Vijay: సీఎం విజయ్ సోషల్ మీడియా పోస్టు వివాదం.. బీజేపీ తీవ్ర విమర్శలు!

తమిళనాడు సీఎం విజయ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. నిషేధిత సంస్థ ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వి. ప్రభాకరన్‌కు పరోక్షంగా నివాళులు అర్పించినట్టుగా భావిస్తూ బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మే 18న ముల్లివైక్కల్ స్మారక దినం సందర్భంగా విజయ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. “ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మన హృదయాల్లో నిలుపుకుందాం. సముద్రానికి అవతల నివసిస్తున్న తమిళ సోదర సోదరీమణుల హక్కులకు ఎప్పటికీ మద్దతుగా నిలుద్దాం” అని ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్టు తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మే 18న ముల్లివైక్కల్ స్మారక దినం

శ్రీలంకలో 2009లో జరిగిన అంతర్యుద్ధం చివరి దశలో ముల్లివైక్కల్ ప్రాంతంలో భారీ స్థాయిలో హింస జరిగింది. శ్రీలంక సైన్యం, ఎల్టీటీఈ మధ్య జరిగిన తుదిపోరులో వేలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తమిళులు ప్రతి సంవత్సరం మే 18న ముల్లివైక్కల్ స్మారక దినాన్ని నిర్వహిస్తుంటారు. యుద్ధంలో మరణించిన తమ బంధువులు, ప్రజలను ఈ రోజు స్మరించుకుంటారు.

విజయ్ పోస్టును తప్పుబట్టిన బీజేపీ

అయితే విజయ్ చేసిన పోస్టును బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేత అమిత్ మాలవ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యులుగా భావించే ఎల్టీటీఈ సంస్థ అధినేత ప్రభాకరన్‌కు నివాళులు అర్పించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని  విమర్శించారు. అధికార భాగస్వామ్యం కారణంగానే కాంగ్రెస్ మౌనం పాటిస్తోందని ఆయన ఆరోపించారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విజయ్ తమిళుల భావోద్వేగాలను గౌరవించారని అంటుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు