క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. టెండర్ల విలువకంటే మూడు రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. బీఆర్‌ఎస్ చేసిన అవినీతి బురదను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారా అంటూ మండిపడ్డారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ‘గన్‌పార్క్ దగ్గర మా మంత్రులు గంట సేపు వేచి చూశారు. మీరు తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్ పేర్లతో టైమ్ పాస్ చేశారు.
మీ గూండాగిరికి భయపడే వాళ్లం కాదు. మీరు ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు’ అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అహంకారం, దొరల పోకడతో ప్రజలను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ నేతల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. తెలంగాణను ఎలా కొల్లగొట్టారో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారని తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్లకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.