తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా ప్రభావం చూపుతుండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండటంతో పాటు తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, రాబోయే 4 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
వర్షాల సూచనలతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని ప్రజలకు సూచించింది. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రేపటి వరకు ఎండల తీవ్రత కొనసాగవచ్చని తెలిపింది.
వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, భారీ ప్రకటన బోర్డులు, హోర్డింగ్స్ సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు. గాలివానల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించడం ప్రారంభమైన వెంటనే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పొలాల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
ALSO READ: కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం