విశాఖపట్టణం, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. ఎట్టకేలకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. విశాఖ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లు వచ్చేశాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రైల్వే డివిజన్ రాయగడ కేంద్రంగా ఏర్పాటైంది.. వాల్తేరు డివిజన్‌ను విభజించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ పనిచేస్తుందని తెలిపారు.
గత నెల 28న విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి నోటిఫై చేస్తామన్నారు.. చెప్పినట్లుగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.తాజాగా గెజిట్ విడుదల చేయడంతో.. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయి. అలాగే మొన్నటి వరకు ఖుర్దా రోడ్ డివిజన్‌లో ఉన్న ఇచ్ఛాపురం టు పలాస రైలు మార్గం విశాఖపట్టణం డివిజన్‌కు బదిలీ చేశారు. అలాగే రాయచూర్ – వాడి సెక్షన్‌ను గుంతకల్ డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్‌కు మార్చారు.
గుంటూరు డివిజన్‌లో ఉన్న పగిడిపల్లి – విష్ణుపురం మార్గం సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ చేశారు. సికింద్రాబాద్ డివిజన్‌లో ఉన్న కొండపల్లి – మోటుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్‌కు మార్చారు. సింగపూర్ రోడ్ – విజయనగరం రాయగడ, విశాఖపట్టణం డివిజన్ల మధ్య కొత్త సరిహద్దుగా ఫిక్స్ అయ్యింది. రైల్వే బోర్డు సౌత్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య సరిహద్దుల వివరాలను గెజిట్‌లో పేర్కొంది. జూన్ 1, 2026 నుంచి కొత్త రైల్వే జోన్‌తో పాటుగా ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. చివరికి 2019 ఫిబ్రవరిలో కొత్త జోన్ ఏర్పాటు చేయడంపై ప్రకటన చేశారు.
ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. చివరికి 2025 జనవరిలో కేంద్రం డీపీఆర్‌కు ఆమోదం తెలపగా.. ఆ వెంటనే ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చిన మమయంలో రైల్వే జోన్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే కొత్త రైల్వే జోన్‌కు అవసరమైన అధికారుల్ని ఇప్పటికే నియమించారు. అలాగే ఇతర రైల్వే డివిజన్ల నుంచి కొత్త విశాఖపట్నం జీఎం ఆఫీసులో పనిచేయడానికి ఆప్షన్లు కోరగా.. ఏకంగా 3వేలమంది ఆసక్తి కనబరిచారు. త్వరలోనే మిగిలిన ఉద్యోగుల్ని నియమించే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి.