-
కవిత కొత్త పార్టీ చివరిన అసోసియేషన్
-
రాజకీయ పార్టీ కాదంటూ ఎద్దేవా చేస్తున్న బిఆర్ఎస్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన సంచలనాన్ని తెర తీశారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఆమె పార్టీ పేరు చివరన అసోసియేషన్ అనే పదాన్ని చేర్చడంపై రకరకాల చర్చి నడుస్తోంది. ఇది సాంకేతిక కారణమా? లేక రాజకీయ వ్యూహమా? అన్నది తెలియడం లేదు. గులాబీ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్ర సేనను ఒక స్వచ్ఛంద సంస్థతోనే పోల్చుతోంది. అది ఎంత మాత్రం రాజకీయ పార్టీ కాదని తేల్చి చెబుతోంది.
నిబంధనలు ఒప్పుకోకపోయేసరికి..
టిఆర్ఎస్ ను మరోసారి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర సేనగా పేరు పెట్టారు అనేది ఇప్పటివరకు తెలిసిన విషయం. కానీ టిఆర్ఎస్ చివరన అసోసియేషన్ అనే పేరును పెట్టడం వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త రాజకీయ పార్టీని నమోదు చేసేటప్పుడు.. ఇప్పటికే ఉన్న పేర్లను లేకుంటే రిజిస్టర్డ్ పార్టీల పేర్లను పోలి ఉంటే.. అటువంటి పేర్లను అనుమతించరు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది గతంలో రిజిస్టర్ అయిన పేరు. అది ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా మారింది. కానీ రికార్డుల్లో పాత పేరుతో ఉంది. దీంతో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం కావడానికి.. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుకు చివరన అసోసియేషన్ అనే పదాన్ని చేర్చాల్సి వచ్చిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎదురుదాడి..
అయితే తెలంగాణ రాష్ట్ర సేన చివరిలో అసోసియేషన్ పేరును అస్త్రంగా చేసుకొని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో కవితపై ఎదురుదాడికి దిగుతోంది. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనేది రాజకీయ పార్టీ కాదని.. అది కేవలం స్వచ్ఛంద సంస్థ మాత్రమేనని ప్రచారం చేస్తోంది. పార్టీ అని పిలిపించుకునే అర్హత లేక అసోసియేషన్ అని పెట్టుకున్నారని.. ఇది ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం అన్నది గులాబీ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ. అసలైన టిఆర్ఎస్ ఈఎన్ఏ తమదేనని.. కవిత ఏర్పాటు చేసింది కేవలం ఒక నామమాత్రపు వేదిక మాత్రమేనని గులాబీ దళం కొట్టి పారేస్తోంది. దీనిపై కవిత వర్గం గట్టిగానే స్పందిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కొన్ని పదాలను చేర్చాల్సి ఉంటుందని.. అంతమాత్రాన అది రాజకీయ పార్టీ కాకుండా పోదని వారు చెబుతున్నారు.
మున్ముందు గట్టి యుద్ధం..
తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఆస్తిత్వాన్ని కెసిఆర్ ఏనాడో విడిచిపెట్టారు. దానిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. తెలంగాణ సెంటిమెంటును వదిలేసారు. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకే కవిత వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ అని పేరు వచ్చేలా కొత్త పార్టీకి పేరు పెట్టుకున్నారు. పేరు ఎలా ఉన్నా తమ జెండా, అజెండా తెలంగాణ అస్తిత్వం అని కవిత వర్గం గట్టిగానే చెబుతోంది. కేవలం సాంకేతిక పరమైన కారణాలతోనే పార్టీ పేరు చివరన అసోసియేషన్ అని పెట్టాల్సి వచ్చిందని.. అంతమాత్రాన గులాబీ పార్టీ విమర్శించాల్సిన పనిలేదని తేల్చి చెబుతోంది. అయితే ఇప్పటివరకు పార్టీ పేరు విషయంలో వివాదం జరిగింది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఎటువంటి కొట్లాట జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్.