తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం కొనసాగుతున్న వేళ.. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అభిమాన సంఘం ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
పేద విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ స్టడీ హబ్స్
ధనుష్ నార్పని ఇయక్కం ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఏసీ ట్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. 2027 జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. తొలి విడతలో రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పదో తరగతి, ఇంటర్మీడియట్‌కు సమానమైన 12వ తరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా సహాయం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. ‘స్మార్ట్ స్టడీ హబ్స్’ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాల్లో విద్యార్థులకు అనుకూలమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కల్పించనున్నారు.
ప్రతి కేంద్రంలో ముగ్గురు టీచర్లు
ఈ స్టడీ హబ్స్‌లో ఒక్కో కేంద్రానికి ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక సహాయకుడిని నియమించనున్నట్లు సమాచారం. వారి జీతభత్యాలను ధనుష్‌కు చెందిన సేవా సంస్థ భరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ ట్యూషన్లు పొందలేని విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
మరోవైపు ధనుష్ రాజకీయ రంగంలోకి వస్తారనే ప్రచారం కూడా తమిళనాట ఆసక్తిని పెంచుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ఆయన రాజకీయ పార్టీని నమోదు చేశారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. అభిమాన సంఘాలను సంక్షేమ కార్యక్రమాల దిశగా నడిపించడం, మహిళా సభ్యులతో సమావేశాలు నిర్వహించడం వంటి పరిణామాలు ఈ చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి.
అయితే, ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఆయన పేరుతో ప్రచారంలో ఉన్న పార్టీ వివరాలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఉచిత విద్యా కేంద్రాల ఏర్పాటు ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలు, అమలు తేదీపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సినిమాలతో పాటు సామాజిక సేవ ద్వారా ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ వార్తలపై ధనుష్ నుంచి అధికారిక స్పందన వస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read: ‘మూకుత్తి అమ్మన్ 2’లో రెజీనా విలనిజం.. నయనతారతో ఫైట్ సీన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
