Homeతెలంగాణనిమ్స్ డాక్టర్ అక్రమాస్తుల సామ్రాజ్యం.. ఏసీబీ సోదాల్లో రూ. 80 కోట్లకు పైగా ఆస్తులు లభ్యం!

నిమ్స్ డాక్టర్ అక్రమాస్తుల సామ్రాజ్యం.. ఏసీబీ సోదాల్లో రూ. 80 కోట్లకు పైగా ఆస్తులు లభ్యం!

క్రైమ్ మిర్రర్ : నిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విలాసవంతమైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులతో పాటు కోటిన్నర రూపాయలకు పైగా వడ్డీ వ్యాపారం చేస్తూ ఆయన నిర్మించిన అక్రమాస్తుల సామ్రాజ్యాన్ని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు బట్టబయలు చేశారు.

తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఆదాయానికి మించి విపరీతంగా ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం మంగళవారం తెల్లవారుజాము నుంచే ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు.. బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఏసీబీ సోదాల్లో బయటపడిన ప్రధాన ఆస్తుల వివరాలు

మార్కెట్ విలువ: ప్రభుత్వ రికార్డుల ప్రకారం డాక్యుమెంట్ల విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

స్థిరాస్తులు: కూకట్‌పల్లి, మణికొండ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, భువనగిరి, నందిగామ, శామీర్‌పేటలలో ఓపెన్ ప్లాట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు.

లగ్జరీ కార్లు & నగలు: జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ వంటి ఖరీదైన విలాసవంతమైన కార్లు, అత్యంత విలువైన గ్యాడ్జెట్లు మరియు అర కిలో కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

డిపాజిట్లు & పెట్టుబడులు: ప్రైవేట్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులతో పాటు.. బ్యాంకుల్లో రూ.41 లక్షల నగదు నిల్వలు, పోస్టాఫీసులో రూ.12 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.

ఇంకా అనేక ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
also read : షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. 9 ముక్కలుగా మృతదేహం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు