- నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్
విజయవాడ, క్రైమ్ మిర్రర్: పొలిటికల్ గ్యాసిప్స్ అనేవి సర్వసాధారణం. ఎన్నికలతో పని లేకుండా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలో ఒక వార్త వైరల్ అవుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్త పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
అదే జరిగితే నందమూరి అభిమానులకు శుభవార్త అని చెప్పవచ్చు..ఏపీ రాజకీయాలతో పాటు సినిమా రంగాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్ నట వారసుడిగా తెరపైకి వచ్చారు బాలకృష్ణ. సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు.
రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 2014 నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. మూడు దఫాలుగా హ్యాట్రిక్ కొట్టారు. అయిన మంత్రి పదవి దక్కలేదుతెలుగుదేశం పార్టీలో నందమూరి ఫ్యామిలీకి సరైన ప్రాధాన్యత లేకుండా పోయిందన్న విమర్శ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.
కానీ అటువంటిదేమీ పట్టించుకోరు నందమూరి బాలకృష్ణ. తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల బాలకృష్ణ భార్య వసుంధర దేవి సైతం తరచూ హిందూపురం నియోజకవర్గం లో పర్యటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్లో బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు.
బావ చంద్రబాబు సీఎం గా ఉన్నారు. బాలకృష్ణ కు మంత్రి పదవి ఇస్తే రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తారన్న ఆలోచన చంద్రబాబులో ఉంది. ఇటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి ఇస్తారా? అనేది ఒక అనుమానం.అయితే .త్వరలో మెగా బ్రదర్ నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నాగబాబును ఎమ్మెల్సీ చేశారు.
విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయం. అయితే మెగా కుటుంబంలో ఇద్దరికి ఇచ్చి నందమూరి కుటుంబంలో ఒకే ఒక్కడుగా ఉన్న బాలకృష్ణకు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. పైగా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న విమర్శకు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా చెక్ చెప్పవచ్చు. అందుకే ఈసారి మంత్రి పదవి బాలకృష్ణ కు ఖాయం అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది.

