•మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభ
•అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇంటర్‌సెప్టర్ వాహనం సంగారెడ్డి జిల్లాలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది” – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
క్రైమ్ మిర్రర్, సంగారెడ్డి :- సంగారెడ్డి జిల్లా ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖకు అందజేసిన అత్యాధునిక ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వాహనం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్‌ఎస్‌ఎస్‌సి మేనేజ్‌మెంట్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ఈ ఇంటర్‌సెప్టర్ వాహనం రాత్రి గస్తీ నిర్వహించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద పరిస్థితులను వీడియో రూపంలో రికార్డు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. హైవేలపై అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి ఫోటోలు క్యాప్చర్ చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల పాటు సేవలందించేలా ఈ వాహనాన్ని సిద్ధం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆయుధ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రమాదాలు, నేరాలు, అత్యవసర సంఘటనలపై వెంటనే స్పందించేలా ఈ వాహనం పనిచేస్తుందన్నారు.
సంగారెడ్డి జిల్లా ప్రజల భద్రత, పరిశ్రమల రక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎస్‌ఎస్‌సి కీలకంగా పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో “షీ-షట్లర్” ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్‌ఎస్‌ఎస్‌సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.