క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో రాత్రి నుంచి వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
తెలంగాణలో ఏకధాటిగా వానలు:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది. పలుచోట్ల రోడ్లపై నీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీని ప్రభావంతో రాత్రి నుంచి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు చీకట్లోనే కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏపీలో అల్పపీడన ప్రభావం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA (Andhra Pradesh State Disaster Management Authority) పేర్కొంది.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు.మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?రెండు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం సురక్షితం. మరి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో, వర్షం పడుతోందో లేదో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.