స్నేహితులపై అతి నమ్మకం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న విషాదకర ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సాయం చేస్తారని భావించిన స్నేహితులే చివరికి మానసికంగా వేధించడంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
జునాగఢ్ జిల్లా మోనియా గ్రామానికి చెందిన రాజేశ్‌భాయ్ తన కుటుంబంతో కలిసి సూరత్‌లో నివసిస్తూ ఎంబ్రాయిడరీ వ్యాపారం నిర్వహించేవాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఎంబ్రాయిడరీ యంత్రాలను అమ్మి సుమారు రూ.14 లక్షలు సమకూర్చుకున్నాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చుకోవాలని భావించాడు.
అయితే, తన స్నేహితుడు కెనడా వెళ్లాల్సి ఉందని చెప్పి ఆ మొత్తం డబ్బును అప్పుగా తీసుకున్నాడు. నిర్ణయించిన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో రాజేశ్ పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా అతని పేరుతో పలు బ్యాంక్ ఖాతాలను తెరిపించి, వాటిని ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగిస్తానని చెప్పాడు.
కొద్దిరోజులకు ఆ ఖాతాలను అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలిసి రాజేశ్ షాక్‌కు గురయ్యాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయగా, స్నేహితుడు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ‘నువ్వే అక్రమాలకు పాల్పడుతున్నావని పోలీసులకు చెబుతా’ అంటూ భయపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక మరో ఇద్దరు పరిచయస్తులు కూడా అతని వద్ద నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు సమాచారం. రోజురోజుకూ వేధింపులు పెరుగుతుండటంతో రాజేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఆ బాధను తట్టుకోలేక తన జీవితాన్ని ముగించుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ముగ్గురు వ్యక్తుల పేర్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
also read: కర్ణాటక ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ – ముగ్గురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
