-
నేడు కూటమి నేతల కీలక సమావేశం…!
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ.!
క్రైమ్ మిర్రర్, ఏపీ స్టేట్ బ్యూరో: ఏపీలో కూటమి నాయకుల కీలక సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలతోపాటు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
వీటిలో రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మరో స్థానాన్ని బిజెపికి కూటమి నాయకులు కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయాస్థానాలకు ముఖ్య నాయకుల నుంచి తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉండవలె లోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరు కానున్నారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై చర్చించడంతోపాటు స్పెషల్ ఇంటెన్షియల్ రివిజన్ (SIR) పై మూడు పార్టీల నడుమ సమన్వయం ఎలా ఉండాలి? అనే విషయాలను చర్చించనున్నారు.
అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజల్లోకి రెండేళ్ల పాలనను ఎలా తీసుకెళ్లాలని అంశాల పైన చర్చించే అవకాశం ఉంది. రెండేళ్ల పాలనకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేయడంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బీజేపీకి రాజ్యసభ సీటు లేనట్టేనా..
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీకి, ఒక్కో సీట్ చొప్పున జనసేన, బిజెపికి కేటాయిస్తారని తొలుత భావించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు బిజెపికి ఇచ్చే సీటు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈసారికి రాజ్యసభ సీటు ఇవ్వలేమని బిజెపి అధిష్టానానికి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే బిజెపి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇకపోతే టిడిపి, జనసేనలో రాజ్యసభ సీట్లకు భారీగా పోటీ నెలకొంది. సీనియర్ నాయకులతోపాటు పార్టీ కోసం గడిచిన ఎన్నికల్లో కష్టపడిన పలువురు ముఖ్య నాయకులు కూడా రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. వీరిలో యనమల రామకృష్ణుడు, సానా సతీష్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్, దొవ్వారపు రామారావు వంటి సీనియర్ నేతలు రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు.
వీరితోపాటు లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు నేతలు కూడా రాజ్యసభ సీటు కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేనలో లింగమునేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే మరో ఇద్దరు ముఖ్య నాయకులు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీలో నాదెండ్ల మనోహర్ వంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఉందని, ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వారికి రాజ్యసభ సీటును కేటాయించడం ద్వారా మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఆలోచనలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా జనసేన ఉంది. ఈరోజు నిర్వహించే సమావేశంలో ఇరు పార్టీలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.