క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నీ తానై కనిపించేవారు. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ తెరపైకి వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనిపించకుండా మానేశారు. దీంతో ఏదో జరిగిందన్న అనుమానం పెరుగుతోంది. వైసీపీలోనే రకరకాల ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సజ్జల వర్సెస్ చెవిరెడ్డి అన్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పై చేయి సాధించినట్లు సమాచారం.
సజ్జల సైడ్…
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే అందుకు సజ్జల తీరే కారణమని కొంతమంది సీనియర్లు ఆరోపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. విశ్వసించలేదు కూడా. ప్రాధాన్యత తగ్గినట్టే తగ్గించి సజ్జలకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు కట్టబెట్టారు. తన తరువాత అంతటి పెద్ద పోస్టు ఇచ్చారు. అయితే మొన్న ఆ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించకుండా మానేశారు జగన్ వెంట. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ వెంట నిత్యం కనిపించడం ప్రారంభించారు.
అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసారన్న ప్రచారం మొదలైంది. తాడేపల్లి లో ఏ కార్యక్రమం జరిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనిపించడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. సర్వే సంస్థలతోపాటు వివిధ రూపాల్లో జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరయ్యారట.
అన్ని ఆధారాలతో…
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం తెలియంది కాదు. ఎందుకంటే పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వారినే సైడ్ చేయించిన ఘనత సజ్జల రామకృష్ణారెడ్డి ది. అటువంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పక్కా ప్లాన్ తో కొన్ని రకాల ఆధారాలు సేకరించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అనే ఆధారాలు సజ్జల సేకరించారట. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎగ్ పఫ్ల వివాదం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనవసరంగా ఈ వివాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది.
దాని వెనుక కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆధారాలు సేకరించారట. అప్పట్లో సీఎంవో కు భోజనాల కాంట్రాక్టు చెవిరెడ్డి తీసుకున్నారని.. అప్పటివరకు 300 రూపాయలు ఉన్న భోజనం ఖర్చును వెయ్యి రూపాయలుగా చూపించి ఒక్కో ప్లేటు వద్ద అధికంగా వసూలు చేశారని.. నిధుల సర్దుబాటులో భాగంగానే అప్పట్లో ఎగ్ పఫ్ ఖాతాలు వేయవలసి వచ్చిందని సజ్జల పూర్తిస్థాయి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వాటిని జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా సైడ్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
