సూర్యపురం, క్రైమ్‌మిర్రర్: బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్స|హాల మధ్య జరుగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారిన ఘటన సూర్యపురం జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యపురంజిల్లా కంభంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకల రేపింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే నలుగురు మృతిచెందారు. 8 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ వీసా మోసం… ఒమన్ ప్రయాణానికి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరులోని నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోతో పాటు అక్కడ ఉన్న వారి పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర వయసు గల చిన్నారి ఆవుల నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వీరక్కతో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: గబ్బిలం వాలింది… రెండు నెలల్లోనే ప్రాణాలు కోల్పోయిన బాలుడు! షాకింగ్ రేబీస్ కేసు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.