హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఐదు ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఇరు పక్షాలు పరస్పర రాజీకి రావడంతో ఈ వ్యవహారం ముగింపుదశకు చేరింది. రాయదుర్గంలోని భూమికి బదులుగా ప్రభుత్వం మరోచోట భూమి కేటాయించేందుకు ముందుకు రావడంతో, SBI కూడా ఆ ప్రతిపాదనకు అంగీకరించింది. దీనితో పాటు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది.
ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఐఐసీ ఎండీ శశాంకలతో పాటు SBI ఉన్నతాధికారులు జీఎస్ రాణా, నీలేష్ ద్వివేదీ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 2.5 ఎకరాలు లేదా ఉస్మాన్‌నగర్‌లో 2.5 ఎకరాలు లేదా భారత్ ఫ్యూచర్ సిటీలో 10 నుండి 15 ఎకరాల వరకు భూమి ఇవ్వడానికి సిద్ధమని వెల్లడించింది. ఈ ప్రతిపాదనలకు SBI ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అయితే తుది నిర్ణయం కోసం తమ బ్యాంకు బోర్డు ఆమోదం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
నిజానికి, గత నెలలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూముల ప్రతిపాదనను SBIకి ఇచ్చింది. మే 12న SBI ప్రతినిధులు ఆ భూములను పరిశీలించి సానుకూలంగా స్పందించినప్పటికీ, తరువాత ఉన్నతస్థాయి ఆమోదం ఆలస్యం కావడంతో నిర్ణయం నిలిచిపోయింది. ఇక రాయదుర్గంలోని ఈ భూమిని ప్రభుత్వం వేలం వేయగా ఎకరాకు రూ.237 కోట్ల ధర పలికింది. దీంతో ఆ భూమిపై తమ హక్కు ఉందంటూ SBI హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, SBIపై కొన్ని పరిపాలనా చర్యలు తీసుకునే దిశగా కూడా ఆలోచించింది.
అయితే తాజా చర్చలతో ఇరు పక్షాలు రాజీ దిశగా అడుగులు వేయడంతో వివాదానికి తెరపడింది. భూముల కేటాయింపు పూర్తయ్యాక హైకోర్టులో కేసును అధికారికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ పరిణామం రాష్ట్రంలో కీలక భూవివాదాలకు ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది.
also read: రైల్లో చెత్త వేస్తూ 8 గంటలు హంగామా.. సహనం కోల్పోయిన ప్రయాణికుడు చెప్పిన షాకింగ్ స్టోరీ!