Homeక్రైమ్పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం.. టీ స్టాల్‌ నిర్వాహకుడు మృతి

పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం.. టీ స్టాల్‌ నిర్వాహకుడు మృతి

క్రైమ్ మిర్రర్ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీ స్టాల్‌ నిర్వాహకుడు పొలాస సుధాకర్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దేవాంగపల్లికి చెందిన సుధాకర్‌ భీమ్‌గల్‌ బస్టాండ్‌ సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు.

రాత్రి 10 గంటల తర్వాత దుకాణం కొనసాగిస్తున్నాడన్న కారణంతో పోలీసులు గతంలో పలుమార్లు జరిమానాలు విధించినట్లు సుధాకర్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా జరిమానా విధించడంతో దాన్ని చెల్లించేందుకు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అయితే తనపై కేసు నమోదు చేశామని, జరిమానాను కోర్టులో చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు చెప్పడంతో సుధాకర్‌ తీవ్రంగా కలత చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు పేర్కొన్నారు.

ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనను గమనించిన పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే సుధాకర్‌ మృతిచెందినట్లు సమాచారం.

వేధింపులు జరిగాయని కుటుంబ సభ్యుల ఆరోపణ

తనపై ఎస్సై తిరుపతి పలుమార్లు జరిమానాలు విధించారని, కొంతకాలంగా ఓ వ్యాపారితో పాటు కొందరు విలేకరులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జరిమానా విషయంలో పలుమార్లు అభ్యర్థించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

పోలీసులపై ఆరోపణలను ఖండించిన సీపీ

ఈ ఘటనలో పోలీసుల వైపు ఎలాంటి తప్పిదం లేదని నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య తెలిపారు. సుధాకర్‌ దుకాణానికి ఎదురుగా ఉన్న ఓ కిరాణా వ్యాపారి తన వద్ద సిగరెట్లు కొనడం లేదన్న కారణంతో ఇద్దరు రిపోర్టర్లను పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన వివరించారు. రాత్రివేళల్లో దుకాణం నిర్వహించినందుకు సుధాకర్‌పై పెట్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సుధాకర్‌ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు, పోలీసుల వివరణతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
also read : బొలెరో, ఆర్టీసీ బ‌స్సు ఢీ…! ఇద్ద‌రు మృతి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు