నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, నిందితుడిపై పోక్సో కేసు

0
3

క్రైం మిర్రర్ : ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వివరాల ప్రకారం.. బాధిత చిన్నారి ప్రతిరోజు మాదిరిగానే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన చమక పాలెయ అనే వ్యక్తి చిన్నారిపై కన్నేశాడు. చాక్లెట్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి, నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన తర్వాత తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి ఎలాగోలా తన ఇంటికి చేరుకుంది. అనంతరం జరిగిన విషయాన్ని తల్లికి కన్నీళ్లతో వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి చెప్పిన విషయాలు విన్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. గ్రామంలో నిర్వహించిన పంచాయితీ సమయంలో నిందితుడు హాజరై తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ, బాధిత చిన్నారి తల్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. న్యాయం కోసం ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి తల్లి బిషోయ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి, పోక్సో (POCSO) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారికి న్యాయం జరగాలని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
read also : చిత్తూరు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here