క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. జులై 10న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అఖిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో తనకు అత్యంత ఇష్టమైన డ్యాన్సర్ గురించి ఆయన చెప్పిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల యాంకర్ సుమ నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అఖిల్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా పాల్గొంది. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో సుమ అడిగిన ప్రశ్నలకు అఖిల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
“మీ దృష్టిలో టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?” అని సుమ అడగగా, అఖిల్ ఏమాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో అద్భుతమైన డ్యాన్సర్లుగా పేరున్న పలువురు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, అఖిల్ నేరుగా రామ్ చరణ్ పేరును ప్రస్తావించడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే రామ్ చరణ్, అఖిల్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో చిన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
ఇంటర్వ్యూలో మరో సందర్భంలో సుమ, మీకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం కదా? అని ప్రశ్నించగా, అఖిల్ ఇచ్చిన సమాధానం మరింత వైరల్ అయింది. ఇష్టం కాదు.. లవ్ అంటూ ఆయన చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఉన్న సోదర భావం మరోసారి బయటపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక లెనిన్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రం మొదట మే 1న విడుదల కావాల్సి ఉండగా, తర్వాత జూన్ 25కు వాయిదా పడింది.
అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి విడుదల తేదీని మార్చి జులై 10గా ప్రకటించారు. ఈ సినిమాపై అఖిల్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కెరీర్‌లో సరైన విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్న అఖిల్‌కు లెనిన్ కీలక చిత్రంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.