ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన ప్రేమ వివాహం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పెళ్లిళ్లు జరిగి, పిల్లలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సమాచారం ప్రకారం.. ముగ్గురు పిల్లల తల్లి తబస్సుమ్‌కు, ఆరుగురు పిల్లల తండ్రి మహమ్మద్ ఉమర్‌కు మధ్య కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ తమ జీవితాలను కలిసి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు తెలియకుండా కోర్టులో వివాహం చేసుకున్న ఈ జంట.. అనంతరం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం నికాహ్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువర్గాల్లో చర్చ మొదలైంది. చివరకు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని, భార్యాభర్తలుగా కలిసి జీవించాలనుకుంటున్నామని తబస్సుమ్, మహమ్మద్ ఉమర్ స్పష్టం చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఇద్దరికీ ఇప్పటికే పిల్లలు ఉండటంతో ఈ ఘటనపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రేమ వివాహం మొరాదాబాద్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
also read: 2015 మైనర్ల అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు.. నిందుతులకు కఠిన శిక్షలు: ఐదుగురికి జీవిత ఖైదు
