క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు టోల్గేట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి మండలం బొమ్మనంపాడు, చెరుకుంపాలెం ప్రాంతాలకు చెందిన ఐదుగురు బెంగళూరు నుంచి కారులో తమ స్వగ్రామాలకు బయలుదేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రయాణం సాగిస్తుండగా టంగుటూరు టోల్గేట్ వద్ద ప్రమాదం జరిగింది. టోల్ ఫీజు చెల్లించేందుకు కారు ఆగి ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ దాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న ప్రైవేట్ బస్సును ఢీకొంది. లారీ, బస్సు మధ్య కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మృతదేహాల మధ్య చిక్కుకున్న బాలుడు బోరున విలపించిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఓటు వేయడానికి స్వగ్రామానికి బయలుదేరిన వారు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయా గ్రామాల్లో విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
also read : ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం
