Homeఆంధ్ర ప్రదేశ్మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ఐదుసార్లు ఎంపీగా సేవలు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ఐదుసార్లు ఎంపీగా సేవలు

క్రైమ్ మిర్రర్ : మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు (83) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.

1943 జూన్ 7న పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో జన్మించిన రాయపాటి హైదరాబాద్‌లో డిగ్రీ విద్యను పూర్తి చేశారు. 1972లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982 నుంచి 1988 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 39 ఏళ్ల వయసులోనే పెద్దల సభకు ఎన్నికై యువ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 1996లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 1998లోనూ అదే స్థానం నుంచి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా గుంటూరు ఎంపీగా విజయం సాధించి వరుసగా నాలుగుసార్లు లోక్‌సభలో అడుగుపెట్టారు.

2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నేతగా నిలిచారు. 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో పరాజయం పాలయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల్లోనూ రాయపాటి కీలక పాత్ర పోషించారు. జల వనరుల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, ఆర్థిక వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా సేవలందించారు.

విద్యారంగ అభివృద్ధికి కూడా ఆయన విశేష కృషి చేశారు. గుంటూరులోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోనూ రాయపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రాన్స్‌స్టోరీ సంస్థ వ్యవహారాలతో ఆయన పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

వ్యక్తిగత జీవితంలో రాయపాటికి భార్య లీలాకుమారి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో ఆయన భార్య గుండెపోటుతో మరణించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాయపాటి సాంబశివరావు మరణం గుంటూరు రాజకీయ వర్గాలకు తీరని లోటుగా మిగిలింది.
also read :తిరుమలలో పోటెత్తిన భక్తులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు