హైదరాబాద్లోని ఓయో హోటల్లో గుంటూరుకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ‘లివింగ్ ట్రీ ఓయో’ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గుంటూరులోని బ్రాండిపేటకు చెందిన కోట శ్రీరామ్ (29)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ బ్రాండిపేటలోని ఓ థియేటర్లో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల తన యజమానికి సంబంధించిన నగదు, మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే ఆరోపణలు అతడిపై వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరామ్ గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27వ తేదీన తన తల్లితో పాటు యజమానికి కూడా వీడియో సందేశం పంపినట్లు సమాచారం. అనంతరం హోటల్ గదిలో అతడు మృతి చెందిన స్థితిలో కనిపించాడు. గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా శ్రీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. శ్రీరామ్ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? వీడియో సందేశంలో ఏం పేర్కొన్నాడు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: హైదరాబాద్లో భారీ చోరీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 70 తులాల బంగారం మాయం!
