దేశంలో యాసిడ్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక చర్యలకు ప్రతిపాదనలు చేసింది. యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండటమే ఇటువంటి దాడులకు ప్రధాన కారణమవుతోందని అభిప్రాయపడిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థలు రిటైల్‌గా యాసిడ్ విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించే దిశగా సూచనలు చేసింది. అంతేకాకుండా ఆన్లైన్లో యాసిడ్ విక్రయాలు, ఇంటి వద్దకు డెలివరీ చేసే విధానానికి కూడా స్వస్తి పలకాలని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 23న విచారణ చేపట్టిన సందర్భంగా ఈ ప్రతిపాదనలను వెల్లడించింది. గతంలో యాసిడ్ విక్రయాల నియంత్రణకు సంబంధించి కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు సక్రమంగా అమలు కావడం లేదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులకే యాసిడ్ విక్రయాల బాధ్యత
సుప్రీంకోర్టు సూచనల ప్రకారం.. ఇకపై వైద్య అవసరాల కోసం యాసిడ్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా సివిల్ సర్జన్ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.
యాసిడ్ కొనుగోలు చేసే వ్యక్తి తన గుర్తింపు కార్డు, నివాస చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటు ఎంత పరిమాణంలో యాసిడ్ తీసుకుంటున్నారు? దేనికోసం వినియోగించబోతున్నారు? అనే వివరాలను నిర్దిష్ట దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా యాసిడ్ ఎక్కడికి వెళ్తోంది, ఎవరు ఉపయోగిస్తున్నారు అనే విషయాలపై పర్యవేక్షణ సాధ్యమవుతుందని కోర్టు భావిస్తోంది.
యాసిడ్ దుర్వినియోగమైతే కొనుగోలుదారుడిదే బాధ్యత!
యాసిడ్ విక్రయాల నియంత్రణతో పాటు దాని దుర్వినియోగానికి సంబంధించి కొనుగోలుదారుడిపై బాధ్యత విధించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కొనుగోలు చేసిన యాసిడ్‌ను మరొకరు దుర్వినియోగం చేసినా, అందుకు కొనుగోలుదారుడినే బాధ్యుడిగా పరిగణించే విధానం ఉండాలని సూచించింది.
అంతేకాకుండా యాసిడ్ దాడి బాధితులకు చికిత్స ఖర్చులు, పరిహారం అందించేందుకు అవసరమైతే కొనుగోలుదారుల ఆస్తుల వివరాలను సేకరించి, వాటిని జప్తు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది.
పాత నిబంధనలు ఉన్నా.. దాడులు ఎందుకు ఆగడం లేదు?
2013లో లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు, పాయిజన్స్ యాక్ట్-1919 కింద ఉన్న నిబంధనలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయని ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు, నియంత్రణలు ఉన్నప్పటికీ యాసిడ్ దాడులు కొనసాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో యాసిడ్ దాడి బాధితులకు మెరుగైన న్యాయం, వైద్య సహాయం, పునరావాసం కల్పించేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించే బాధ్యతను జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA)కు అప్పగించింది.
విద్యాసంస్థల్లోనూ అవగాహన కార్యక్రమాలు
యాసిడ్ దాడుల నివారణతో పాటు బాధితులకు తక్షణ సహాయం అందించే అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రథమ చికిత్స ఎలా అందించాలి? బాధితులకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయి? వారికి పునరావాసం ఎలా కల్పించాలి? వంటి అంశాలను విద్యార్థులకు వివరించాలని పేర్కొంది.
ఈ ప్రతిపాదనల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలతో రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
యాసిడ్ దాడుల వల్ల జీవితాలను కోల్పోతున్న, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్న బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు, ప్రమాదకర రసాయనాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం.
also read: అండాల అక్రమ సేకరణ వెనుక భారీ నెట్వర్క్? ఫర్టిలిటీ కేంద్రాలపై పోలీసుల నజర్!
