-
గవర్నర్ కోటా కింద ఎంపికకు ప్రయత్నం
-
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో సందడి మొదలైంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గట్టి ప్రయత్నాలతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆయన భార్య కొండా సురేఖ మంత్రి పదవి నుంచి డిస్మిస్ అయ్యారు. వారి కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సెప్టెంబర్ 3న కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత కొండా దంపతులు పార్టీ మారుతారు అంటూ జోరుగా ప్రచారం నడిచింది. అయితే తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని.. పార్టీని వీడియో ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపు నేపథ్యంలో ఆమె భర్త మురళికి పార్టీ పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారన్న టాక్ నడుస్తోంది.
వరంగల్ జిల్లా పై పట్టు…
వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. సురేఖ మంత్రి పదవి కోల్పోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ రాజకీయ పట్టు, ఆధిపత్యం తగ్గిపోతుందన్న భావన ఉన్న మురళి.. అందుకు ప్రత్యామ్నాయంగా తనకు గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలుగా ఉన్న తమ కుటుంబానికి మంత్రి పదవి లేకపోవడం వల్ల కేడర్ లో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని.. అందుకే తమ అనుచరులు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారని మురళి అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఐసిసి ఇన్చార్జ్ బిఎం సందీప్ తో పాటు ఢిల్లీలోని కీలక నేతల వద్ద ఆయన తన వాదనను గట్టిగా వినిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒకవేళ తనకు ఎమ్మెల్సీ పదవి దక్కితే వరంగల్ రాజకీయాల్లో తిరిగి తమ కుటుంబ ప్రాబల్యం నిలబెట్టుకోవచ్చని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుచరులకు అండగా నిలవచ్చని ఆయన భావిస్తున్నారు.
సుముఖత చూపని రాష్ట్ర నాయకత్వం…
కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో రాష్ట్ర నాయకత్వం అంత సుముఖంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తో కొండ కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించే వరకు పరిణామాలు వెళ్లడంతో.. ఇప్పుడు అదే కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పదవీకాలం ముగిసిన మాజీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు మరోసారి అవకాశం ఇవ్వాలని చర్చ కూడా నడుస్తోంది. ఇటువంటి సమయంలో కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి అనేది ఇస్తారు అనుకోవడం అతి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా సీనియర్లు పోటీపడుతున్నారు. అయితే కొండా మురళి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాలి.
