-
గట్టి అభ్యర్థులను బరిలోదించిన కొడాలి నాని
-
ఆర్థిక ప్రోత్సాహం
-
నేరుగా రంగంలోకి దిగకపోవడం మైనస్
-
పట్టణం పై పట్టు సాధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల
-
కూటమి వైపే ఫలితం మొగ్గు
-
క్రైమ్ మిర్రర్ గ్రౌండ్ రిపోర్ట్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: గుడివాడ.. ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది. నందమూరి తారకరామారావు పుట్టిన నేల అది. అందుకే ఆ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొంతకాలంగా ఆ నియోజకవర్గం మరింత పాపులర్ అయింది. దానికి కారణం మాజీ మంత్రి కొడాలి నాని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గుడివాడ నియోజకవర్గాన్ని ఒక సంచలనంగా మార్చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన అనుహ్యంగా ఓడిపోయారు. దీంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అది అంత సులువుగా జరిగే వ్యవహారం కాదు.
కీలక పట్టణం…
కృష్ణా జిల్లాలో కీలక పట్టణంగా గుడివాడ ఉంది. అక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 48 వార్డులు, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక బీసీ మహిళా చైర్పర్సన్ పదవి కోసం నవంబర్ 26న పోలింగ్ జరగనుంది. 30న ఫలితం రానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు వెనిగండ్ల రాము. పట్టణం పై పూర్తి పట్టును నిలుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున అన్ని తానై వ్యవహరిస్తున్నారు కొడాలి నాని. వైసిపి అభ్యర్థుల తరఫున పరోక్షంగా పావులు కదుపుతూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నామినేషన్ల నుంచి అభ్యర్థుల ప్రచారం వరకు, ఆర్థిక వనరులను సమకూర్చడంలోనూ కొడాలి నాని తెరవెనుక పాత్ర పోషిస్తున్నారు.
బలం అంతంతే…
అయితే గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో బలం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వెనిగండ్ల రాము ఘన విజయం సాధించిన తర్వాత పట్టణ స్థాయిలో మళ్లీ బలం పుచ్చుకోవాలని వైసిపి ప్రయత్నిస్తోంది. 48 వార్డుల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం.. ఓటమిలో కొన్ని వార్డుల్లో టికెట్ల ఆశావాహుల మధ్య నెలకొన్న పోటీ వంటి అంశాలు ఎన్నికలను హోరాహోరీగా మారుస్తున్నాయి. కొడాలి నాని గతంలో సుదీర్ఘకాలం నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం, ఆయనకు ఉన్న క్యాడర్ బలం, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు అందుతున్న ఆర్థిక మద్దతు వైసీపీకి ప్రధాన బలాలు. కొడాలి నాని నేరుగా జోక్యం చేసుకోలేకపోయినా.. గట్టిగా పోరాడాలన్న సంకేతంతో అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నారు. అయితే ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో.. ఒక రకమైన ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. కీలక నేతగా ఉన్న నాని నేరుగా ప్రచారంలో ముందుండి నడిపించకపోవడం స్పష్టమైన లోటు.
ఎమ్మెల్యే కు పట్టు…
కూటమికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బలం. గెలిచిన తర్వాత ఆయన పట్టణం పై పూర్తిగా పట్టుబిగించారు. వార్డుల వారీగా సమన్వయం చేసుకోవడం ప్లస్ పాయింట్. ఇటీవల జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం.. ఆ ప్రభావం ఈ ఎన్నికలపై పడింది. 48 వార్డుల్లో టికెట్లు ఆశించిన కొందరు నేతల్లో అసంతృప్తి వల్ల కొన్నిచోట్ల ఓట్లు చిలే అవకాశం ఉంది. వైసిపి అభ్యర్థులకు అందుతున్న ఆర్థిక బలాన్ని, వార్డు స్థాయిలో పాత అనుబంధాలను తట్టుకొని ప్రతి వార్డును గెలుచుకోవడం కూటమికి సవాలే. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితులు, 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఇటీవల స్థానిక ఎన్నికల ట్రెండ్, అధికార కూటమి బలాన్ని పరిశీలిస్తే గుడివాడ మున్సిపాలిటీలో కూటమికి మెరుగైన విజయవకాశాలు కనిపిస్తున్నాయి.
