Homeతెలంగాణసందీప్ కు కత్తి మీద సామే...!

సందీప్ కు కత్తి మీద సామే…!

  • తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు అంత సులువు కాదు

  • కట్టు దాటుతున్న క్రమశిక్షణ

  • లక్ష్మణ రేఖ దాటుతున్న సీనియర్లు

  • కొత్త ఇన్చార్జ్ కు అనేక సవాళ్లు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్.. ఈ మాట వింటేనే అంతర్గత విభేదాలు, వర్గాల కుమ్ములాటలు, నేతల మధ్య ఆధిపత్య పోరు వంటివి కనిపిస్తాయి. అందులోనూ తెలంగాణలో ఈ సంస్కృతి అధికం. అందుకే ఇక్కడ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చే వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. నేతల మధ్య సమన్వయం కత్తి మీద సాము లాంటిది. అటువంటిది కర్ణాటక కు చెందిన కాంగ్రెస్ నేత బిఎం సందీప్ కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయనకు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా అన్ని రకాల సమస్యలు ఎదుర్కాబోతున్నాయి. క్రమశిక్షణ విషయంలో గీత దాటుతున్న నేతలను కట్టడి చేయడం అంత సులువైన విషయం కూడా కాదు. ఎమ్మెల్యేలు కట్టు దాటి మాట్లాడుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూసిన పార్టీ కార్యకర్తలు పూర్తి అసహనంతో ఉన్నారు. దీనికి తోడు కొందరు సీనియర్ మంత్రులు సీఎం పైనే నేరుగా హైకమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో కొత్త ఇంచార్జ్ పార్టీని ఏ విధంగా గాడిలో పెడతారు అనేది ఆసక్తికరం.

ఆ కారణంతోనే…

కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్రాల్లో పార్టీని అదుపులో పెట్టుకునేందుకు ఇన్చార్జి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను ఇన్చార్జిలుగా నియమిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇన్చార్జిగా నియమితులైన సందీప్ కు ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. ఆయన రాహుల్ గాంధీ టీమ్ లో ఒకరు. అయితే అదే రాహుల్ టీం నుంచి తెలంగాణ ఇన్చార్జిగా పనిచేశారు మీనాక్షి నటరాజన్. ఆమె ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడంతో తన టీంలో మరో సభ్యుడైన సందీప్ కు అవకాశం ఇచ్చారు రాహుల్. కేవలం ఏఐసీసీకి సన్నిహితుడైన కారణంతోనే ఆయనకు బాధ్యతలు అప్పగించారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలను ఎలా పరిష్కరిస్తారు అన్నది సందేహమే.

సీనియర్లు అన్న అహంభావం…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తమకంటి జూనియర్ అన్న భావన కొంతమంది మంత్రులతో పాటు కీలక నేతల్లో ఉంది. అందుకే ఆయనపై ఎక్కువగా తిరుగుబాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇన్చార్జిగా నియమితులైన సందీప్ కూడా వారి కంటే జూనియర్. వయసులో సీనియర్లతోపాటు అనుభవపరంగా చాలామంది సీనియర్లు తెలంగాణలో ఉన్నారు. అటువంటివారిని ఇంచార్జ్ హోదాలో ఎలా నియంత్రిస్తారో చూడాలి. అయితే రాహుల్తో ఉన్న సంబంధాల దృష్ట్యా కచ్చితంగా వారిని నియంత్రణలో పెడతారన్న టాక్ ఉంది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఇంతవరకు కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణం. సందీప్ ఆ సాహసం చేస్తారా లేదా అనేది చూడాలి.

నామినేటెడ్ పెండింగ్…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. కానీ ఆరు నెలల కిందట ఖాళీ అయిన నామినేటెడ్ పదవులను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో వేలాదిమంది ద్వితీయ శ్రేణి నాయకులు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జాప్యం జరుగుతున్న కొలది నిరసన కూడా తెలుపుతున్నారు. అయితే ఈ పదవుల పంపకాలతో తేడా కొడితే అసమతి బయటపడుతుందని పార్టీ హైకమాండ్ భయపడుతోంది. దీనికి తోడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. వాటిలో కచ్చితంగా గెలవాలి. గెలవకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వీటన్నింటినీ కొత్త ఇంచార్జ్ సందీప్ ఎలా గాడిలో పెడతారు అన్నది ఇప్పుడు ప్రశ్న. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు