Homeతెలంగాణహైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. నాలుగు ప్రముఖ హోటళ్ల లైసెన్సులు రద్దు!

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. నాలుగు ప్రముఖ హోటళ్ల లైసెన్సులు రద్దు!

హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా స్పందించారు. వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటూ వాటి FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ బేకరీ, ఓ మెన్స్ హాస్టల్‌ను సైతం మూసివేయించారు.

అధికారుల చర్యలకు గురైన రెస్టారెంట్లలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మాదాపూర్ బావర్చి, కూకట్‌పల్లిలోని ది స్పైస్ కిచెన్, టోలిచౌకిలోని మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్, చందానగర్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్ ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు తక్షణమే కార్యకలాపాలను నిలిపివేయాలని ఫుడ్ సేఫ్టీ విభాగం ఆదేశించింది.

వంటగదుల్లో అపరిశుభ్రత.. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు

ఈ రెస్టారెంట్లలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా అనేక తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల విసర్జితాలు కనిపించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రిజ్‌లలో శాకాహార, మాంసాహార పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా కలిపి నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అంతేకాకుండా నాణ్యతలేని సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, దెబ్బతిన్న కిచెన్ ఫ్లోరింగ్, పొగతో నిండిన గోడలు వంటి సమస్యలను గుర్తించారు. ఆహార తయారీలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వైద్య పరీక్షల ధ్రువపత్రాలు కూడా అందుబాటులో లేవని అధికారులు వెల్లడించారు.

అనుమతులు లేని బేకరీ, హాస్టల్ మూసివేత

మరోవైపు కనీస ఆహార భద్రతా అనుమతులు కూడా లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న రెండు సంస్థలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. టోలిచౌకిలోని అల్ కరీమ్ బేకర్స్, గౌళిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్‌ను మూసివేయించారు.

135 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం

తనిఖీల్లో భాగంగా నాణ్యతపై అనుమానాలు వ్యక్తమైన ఎనిమిది ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. సుమారు 135 కిలోల నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మరోవైపు రాజు గారి బిర్యానీ, స్వాద్ స్పైసీ రెస్టారెంట్లకు త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. మెహఫిల్ రెస్టారెంట్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. త్వరలోనే మరోసారి తనిఖీలు నిర్వహించనున్నారు.

స్విగ్గీ, జొమాటోలకు కీలక ఆదేశాలు

లైసెన్సులు సస్పెండ్ అయిన నాలుగు రెస్టారెంట్లను వాటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు అధికారులు సూచించారు. సంబంధిత లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

నగర ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా వ్యవహరించే హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

also read: అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖుల సందడి.. చెన్నైలో అంగరంగ వైభవంగా వేడుక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు