-
టిడిపి అభ్యర్థిగా సామాన్య కార్యకర్త
-
కూటమి వైపే స్పష్టమైన మొగ్గు
-
క్రైమ్ మిర్రర్ గ్రౌండ్ రిపోర్ట్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే తొలి విడత మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. కూటమి ఏకపక్షవిజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లోను అదే దూకుడు కనబరిచింది. ఇప్పుడు రెండో విడత మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పై పడింది. ఈనెల 26న జరగనున్న ఈ ఎన్నికల్లో ఈసారి మేయర్ పీఠానికి నేరుగా ప్రజలు ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలను మార్చేసింది. ఎస్ టి కేటగిరికి రిజర్వ్ అయిన మేయర్ స్థానానికి మంత్రి నారా లోకేష్ ఒక సామాన్య పార్టీ కార్యకర్త పేరం ఏడుకొండలను టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు వైసీపీ తరఫున కేతవత్ పూర్ణ నాయక్ బరిలో నిలిచారు. క్షేత్రస్థాయి వాతావరణం మాత్రం అధికార కూటమి వైపు మొగ్గు చూపుతోంది.
కంచుకోట గా మారి…
మంగళగిరి అంటేనే కంచుకోటగా మార్చుకున్నారు లోకేష్. అక్కడి ప్రజలకు ఆత్మబంధువుగా మారిపోయారు. ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కావడంతో కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో ఓటర్లంతా నేరుగా మేయర్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. స్థానిక డివిజన్ స్థాయిలో ఉండే చిన్నపాటి స్థానిక సమస్యలు, గ్రూపు తగాదాలకు అతీతంగా మేయర్ ఓటు విషయానికి వచ్చేసరికి ఓటర్లు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, స్థానిక ఎమ్మెల్యే లోకేష్ నాయకత్వం, రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కార్పొరేటర్ ఓటు ఎవరికి వేసినా, మేయర్ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయాలని బలమైన సెంటిమెంట్ పట్టణ, శివారు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
వెనుకబడిన వర్గాలు ఉన్నచోట…
వాస్తవానికి మంగళగిరి పట్టణంలో చేనేత సామాజిక వర్గం అధికం. తాడేపల్లి పరిధిలో మధ్యతరగతి, ఉద్యోగ, వ్యాపార వర్గాలు నివసించే డివిజన్లలో కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడి నుంచి సుమారు 91 వేల పైచిలుకు రికార్డు మెజారిటీతో గెలుపొందారు. అటు తరువాత నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పేదలకు శాశ్వత ఎల్లపట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు టిడిపికి తిరుగులేని అస్త్రాలుగా మారాయి. జనసేనతో పాటు బిజెపి శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేస్తుండడం కూటమికి కలిసి వచ్చే అవకాశం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమన్వయంలో పించింది. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్న తాడేపల్లి ప్రాంతంలోని ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో కురుకుపోయింది. గత ఐదేళ్ల పాలనలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని అసంతృప్తి ప్రజల్లో బలంగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లిన చోట వ్యతిరేకత కనిపిస్తోంది. డివిజన్లలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు దొరకడం లేదు. ఉన్న నేతలు కూడా ఆర్థికంగా ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేవలం ఎస్టి, మైనారిటీ ఓట్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే క్షేత్రస్థాయిలో కూటమి వ్యూహాల ముందు అవి అంత మాత్రం పనిచేయడం లేదు. ఏకపక్ష ఓటింగ్ పైనే కూటమి దృష్టి పెట్టింది. ఉనికి చాటుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
