-
ఉత్తరాది రాష్ట్రాల్లో అప్పుడే ప్రారంభం
-
పంట వ్యర్ధాల దగ్ధంతో తీవ్రతరం
-
బాణాసంచా కాల్చడంతో చుట్టేసిన కాలుష్యం
-
ఓటు బ్యాంకు రాజకీయంతో నియంత్రణ కరువు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని అప్పుడే వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రతి సంవత్సరం చలికాలం ప్రారంభంలోనే ఒక గ్యాస్ ఛాంబర్ గా మార్చేస్తున్న వాయు కాలుష్యం విపత్తు వెనుక అసలు కారణాలు ప్రభుత్వాలు, పాలకులకు తెలుసు. అయితే ఈ సమస్య తెలిసినప్పటికీ.. పౌరుల శ్వాసను, చిన్నారుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఈ సంక్షోభంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం పాలకవర్గాల నేరపూరిత ఉదాసీనతకు నిదర్శనం. ఈ ఏడాది పంజాబ్లో పంట వ్యర్ధాలు దహనం తగ్గిందన్న సంతృప్తి.. దీపావళి నాటికి ఒక్కసారిగా తలకిందులైంది. నవంబర్ 8న ఒక్కరోజే పంజాబ్లో ఏకంగా 1152 వ్యవసాయ క్షేత్రాల్లో మంటలు చెలరేగడం.. దీనికి తోడు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ అర్ధరాత్రి వరకు అడ్డు అదుపు లేకుండా కాల్చిన బాణాసంచా పొగ తోడై ఢిల్లీని విషపూరిత పొగ మంచు గుప్పెట్లోకి నెట్టాయి. గాలి నాణ్యత సూచి ప్రమాదకరస్థాయిని దాటి సివియర్ ప్లస్ క్యాటగిరిలోకి పడిపోయింది.
విమర్శలతో సరి…
అయితే ఈ వాయు కాలుష్యం పై పరిష్కార మార్గం చూపించాల్సిన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పంజాబ్ ను ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పరస్పరం ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ రైతులే కారణం అని ఒకరంటే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఢిల్లీ స్థానిక కాలుష్యమే అసలు సమస్యని మరొకరు ఎదురుదాడికి దిగుతున్నారు. మధ్యలో కూర్చున్న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విభాగం కేవలం ఉన్నత స్థాయి సమీక్షల ప్రకటనలతో చేతులు దులుపుకుంటుంది. కోట్లు ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన.. నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన పోలీస్, మునిసిపల్ యంత్రాంగాలు పాలకుల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
కఠిన చర్యలేవి…?
ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఈ కాలుష్యంపై నిర్లక్ష్యం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. పంట వ్యర్ధాలను దహనం చేసే రైతులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. పంజాబ్ తో పాటు హర్యానా గ్రామీణ వాటర్లు ఎక్కడ దూరం అవుతారో నన్న భయం ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలను వెంటాడుతోంది. యంత్రాల కొనుగోలుకు రాయితీలు, వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని పూర్తిస్థాయిలో రైతులకు చేర్చడంలో రాజకీయ సంకల్పం కొరవడింది. మరోవైపు బాణసంచా పై నిషేధాన్ని అమలు చేస్తే అది మతపరమైన, సాంప్రదాయక మనోభావాలను దెబ్బతీస్తుందన్న భయంతో ఢిల్లీ పరిసరాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. మనుషులు పీల్చే స్వచ్ఛమైన గాలిని కూడా రాజకీయాలకు ముడిపెట్టి సమాజ ఆరోగ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. సామాన్య పౌరుల్లో సరికొత్త చైతన్యం కనిపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది.
