-
తెలంగాణ నీటి ప్రయోజనాలపై వ్యాఖ్యలు
-
కృష్ణా జలాల తరలింపు పై ఏపీ పై హాట్ కామెంట్స్
-
సీఎం రేవంత్ పై ఒకే తరహా విమర్శలు..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కవిత సైతం నీటి ఉద్యమాలను నమ్ముకున్నారా? మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగుల దిగువన సొరంగం తవ్వి.. నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టిందని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ప్రెస్మీట్లో, టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సోషల్ మీడియాలో ఒకేసారి ఆరోపణలు చేశారు. ఘర్ డెడ్ స్టోరేజీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా.. రహస్యంగా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని వీరు నిలదీశారు. తాగునీటి ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోందని.. ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నా ప్రభుత్వానికి, నిఘా వ్యవస్థకు కనీస సమాచారం లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ముందస్తు అనుమతితోనే…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నల్ ప్రాజెక్టును చేపట్టిందా అని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ఎంత భారీ ఎత్తున పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం లేదంటే.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాదని కవిత ట్విట్ చేశారు. కృష్ణ బేసిన్ హక్కులను, తెలంగాణ నీతి ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎలాంటి అనుమతులు లేని ఈ అక్రమ ప్రాజెక్టు పనులను అడ్డుకునేలా కేంద్రంపై, కృష్ణ నది యాజమాన్య బోర్డుపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
గతంలోనే అప్రమత్తం…
అయితే ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతోందన్న అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ గతంలోనే అప్రమత్తమయింది. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా గుట్టుగా పనులు చేపడుతున్న ఏపీ తీరని తప్పుపడుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కు, ఏపీ ఈఎన్సికి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారికంగా లేఖలు రాసి తన తీవ్ర అభ్యంతరాన్ని నమోదు చేశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టులు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన అధికారిక చర్యలను ఇరిగేషన్ శాఖ ఎప్పటికప్పుడు తీసుకుంటుందని… దీనిపై రాజకీయ లబ్ధి కోసం గులాబీ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే సొరంగం తవ్వడం రాత్రికి రాత్రి సాధ్యమేనా.. అసలు కడుతున్న ప్రాజెక్టు ఏమిటి అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
