Homeతెలంగాణసిద్దిపేటలో పొలిటికల్ హై టెన్షన్...!

సిద్దిపేటలో పొలిటికల్ హై టెన్షన్…!

  • సీఎం రేవంత్ సభకు ముమ్మర ఏర్పాట్లు

  • ప్రెస్ మీట్ పెట్టి ముందస్తు దాడి చేసిన హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :సిద్దిపేట పై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గులాబీ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వ్యూహాల రూపొందిస్తోంది. అందులో భాగంగా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట గడ్డపైనే కాంగ్రెస్ జెండాను బలంగా ఎగురవేయాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ నేరుగా సిద్దిపేటలో అడుగుపెట్టడం ద్వారా ప్రతిపక్ష శిబిరంలో రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దశాబ్దాలుగా తనకు ఎదురులేని నియోజకవర్గంగా ఉన్న సిద్దిపేటలో సీఎం రేవంత్ సభ నిర్వహిస్తుండడం హరీష్ రావుకు, స్థానిక గులాబీ పార్టీ నాయకత్వానికి టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పలువురు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. రేవంత్ రెడ్డి సభ వేదికగా కీలక చేరికలు, ప్రకటనలు ఉండే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గులాబీ పార్టీ శ్రేణుల్లో ఇవి కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

సొంత ఇలాకాలో…

సొంత ఇలాకాలో పట్టుకోల్పోకుండా కాపాడుకునేందుకు హరీష్ రావు తన నియోజకవర్గం పర్యటనలను ముమ్మరం చేస్తూ.. క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. సీఎం పర్యటనకు ముందే హరీష్ రావు బహిరంగ లేక విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. సిద్దిపేట అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని మండిపడ్డారు. దుద్దెడ వద్ద రూ.300 కోట్లతో మంజూరైన వెటర్నరీ కాలేజీ ని సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు తరలించుకుపోయారని.. సుమారు రూ.1070 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసి సిద్దిపేట విస్మరించడం పై హరీష్ రావు నిలదీశారు. కొడంగల్ లో తనపై ఉన్న రాజకీయ కక్షను సిద్దిపేట ప్రజలపై చూపించవద్దని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని వస్తే తానే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని సవాల్ చేశారు.

కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని…

సిద్దిపేట సభతో గులాబీ పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగురువేయడంతోపాటు.. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలోని అక్రమాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని ప్రజల ముందు ఉంచుతామని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాటు చేస్తుండగా.. హరీష్ రావు ముందస్తు గాడితో ఒక రకమైన పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు