దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి ఓ ఇంటివాడు కాబోతున్నారు. శశాంక్ వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్నేహితురాలి కుటుంబానికి చెందిన సంజనతో ఆయన వివాహం జరిపించేందుకు పెద్దలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య వివాహ సంబంధిత చర్చలు పూర్తయ్యాయని, నిశ్చితార్థ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న శశాంక్ శ్రీహరి, సంజనల నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ శుభవార్తతో శ్రీహరి అభిమానుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. అయితే నిశ్చితార్థానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీహరి కుటుంబంలో జరగనున్న ఈ వేడుకపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read: మాజీ మంత్రి జానారెడ్డి గన్‌మెన్ కన్నుమూత.. గుండెపోటుతో మృతి
