కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ప్రతిష్ఠకు, ముఖ్యంగా సినీ కళాకారుల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ మేరకు కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అందజేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి సృష్టిస్తున్న నకిలీ వీడియోలు, ఇతర కంటెంట్ కారణంగా కళాకారుల వ్యక్తిగత హక్కులు, గుర్తింపు, గౌరవానికి ఎదురవుతున్న సమస్యలను చిరంజీవి కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై స్పందించిన అమిత్ షా.. ఏఐ, డీప్‌ఫేక్‌ల దుర్వినియోగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు అధికారికంగా వినతిపత్రం అందించాలని చిరంజీవికి సూచించారు.
దీంతో అమిత్ షా సూచన మేరకు చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన విజ్ఞప్తిని అందించారు. ఈ సమస్యను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను పరిరక్షించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏఐ దుర్వినియోగం వల్ల సామాన్య పౌరులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరి భద్రతను కాపాడటం సమాజం బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
సాంకేతిక పరిజ్ఞానం మనిషి సృజనాత్మకతను మరింత విస్తరించేందుకు ఉపయోగపడాలే తప్ప, ఇతరుల గౌరవానికి భంగం కలిగించే సాధనంగా మారకూడదన్నది చిరంజీవి అభిప్రాయం.
also read: పాన్ ఇండియా సినిమా ఓ పెద్ద స్కామ్.. నిర్మాతల లాభాల కోసమే ఈ హడావుడి: అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు
