పిల్లల పెంపకం విషయంలో సమాజం ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మెగా కోడలు, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల అభిప్రాయపడ్డారు. పిల్లల సంరక్షణ అనేది కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, తండ్రులకు కూడా సమాన బాధ్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇంటి నుంచే సమానత్వం మొదలుకావాలని, అప్పుడే సమాజంలోని ఇతర రంగాల్లోనూ మహిళలకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల బాధ్యతల విషయంలో సమాజం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఉపాసన ప్రస్తావించారు. తండ్రి పిల్లలకు భోజనం తినిపించినా, డైపర్ మార్చినా ఎంతో గొప్పగా ప్రశంసిస్తారని, అదే పనిని తల్లి ప్రతిరోజూ చేస్తున్నప్పటికీ ఆమెకు అలాంటి గుర్తింపు లభించడం లేదని అన్నారు. ఈ ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పిల్లల సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం కావడాన్ని ప్రత్యేకంగా చూడకూడదని ఉపాసన పేర్కొన్నారు. పిల్లలను చూసుకోవడం తండ్రి చేసే గొప్ప సాయమో, తల్లికి చేసే ఉపకారమో కాదని.. అది తండ్రిగా ఆయన నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ భావన చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని, విద్యా విధానంలోనూ ఇలాంటి విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తన కుటుంబ జీవితంలోని అనుభవాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు. గతంలో రామ్ చరణ్ పిల్లలకు భోజనం తినిపిస్తుంటే ఎంతో ముచ్చటగా చూసేదాన్నని, అయితే ఇప్పుడు అది తల్లిదండ్రులుగా ఇద్దరూ పంచుకోవాల్సిన సహజమైన బాధ్యత అని అర్థం చేసుకున్నానని వివరించారు.
ఇంట్లోనే మహిళలకు సమాన గౌరవం, బాధ్యతల్లో సమాన భాగస్వామ్యం ఉంటేనే కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల్లోనూ నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని ఉపాసన అభిప్రాయపడ్డారు. పిల్లల పెంపకంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
also read: వారణాసి షూటింగ్ పూర్తి.. అసలైన సర్ప్రైజ్ త్వరలోనే అంటున్న రాజమౌళి టీమ్!
