Homeజాతీయందిల్జిత్ దోసాంజ్ వినూత్న నిరసన.. వేదికపై రాహత్ ఇందోరి కవితతో అదిరిపోయే కౌంటర్!

దిల్జిత్ దోసాంజ్ వినూత్న నిరసన.. వేదికపై రాహత్ ఇందోరి కవితతో అదిరిపోయే కౌంటర్!

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తన ఇండోర్ సంగీత కచేరీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన పాటల ప్రదర్శనపై అధికారులు విధించిన ఆంక్షలకు ఆయన వినూత్నంగా స్పందించారు. మైక్ అందుకుని పాటల గురించి మాట్లాడటానికి బదులుగా, ప్రముఖ కవి రాహత్ ఇందోరి రచించిన కవితను వినిపిస్తూ తన నిరసనను తెలియజేశారు.

ఆదివారం ఇండోర్‌లో నిర్వహించిన ‘ఆరా ఇండియా టూర్’ సంగీత కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దిల్జిత్ పాడే కొన్ని ప్రముఖ పాటలను కచేరీలో ప్రదర్శించకూడదని జిల్లా బాలల సంరక్షణ అధికారి నిర్వాహకులకు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ‘పటియాలా పెగ్’, ‘5 తారా’, ‘కేస్’, ‘జట్ ఉతే ఫైర్ కర్దా’ వంటి నాలుగు పాటలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పాటల్లో మద్యం ప్రస్తావన ఉండటంతో చిన్నారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నిర్ణయంపై దిల్జిత్ వేదికపైనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏ పాట పాడాలి, ఏది పాడకూడదంటూ పరిమితులు విధిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఇండోర్‌కు చెందిన ప్రముఖ కవి రాహత్ ఇందోరి రాసిన కవితను ప్రస్తావించారు. దేశం అందరిదనే భావనను ప్రతిబింబించే ఆ కవితా పంక్తులను వినిపించడంతో అక్కడున్న ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఇదిలా ఉంటే, ఇండోర్ వేదికపై రాహత్ ఇందోరి కవితను దిల్జిత్ ప్రస్తావించడం ఇది రెండోసారి. 2024 డిసెంబర్ 8న జరిగిన తన గత కచేరీ సమయంలోనూ స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడంతో ఇదే కవితను చదివి వినిపించారు. తాజాగా మరోసారి అదే కవిత ద్వారా తన వైఖరిని వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది.

మరోవైపు, దిల్జిత్ తదుపరి సంగీత కార్యక్రమం జరగనున్న అహ్మదాబాద్‌లోనూ ఆయన పాటల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

also read:  వంజంగి హిల్స్‌కు వెళ్లే పర్యాటకులకు నిరాశ.. మరో మూడు వారాల పాటు ఆంక్షలు పొడిగింపు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు