ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ సందర్శనకు వెళ్లాలనుకునే వారికి నిరాశ ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ పర్యాటక కేంద్రంపై విధించిన ఆంక్షలను అటవీ శాఖ అధికారులు మరో మూడు వారాల పాటు పొడిగించారు. తుపాను ప్రభావంతో కొండపైకి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాడేరు సమీపంలో ఉన్న వంజంగి హిల్స్‌ను మేఘాల కొండలుగా పిలుస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో సూర్యోదయ సమయంలో మేఘాల మధ్య ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే గత నెలలో వచ్చిన అర్నాబ్ తుపాను ఈ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వంజంగి గ్రామం నుంచి కొండపై ఉన్న వ్యూ పాయింట్‌కు వెళ్లే ప్రధాన అప్రోచ్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.
ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా పర్యాటకుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం రహదారి మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పటికీ, అవి ఇంకా పూర్తికాలేదు. దీంతో పర్యాటకుల ప్రవేశంపై నిషేధాన్ని మరో మూడు వారాల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. దేవిరాజేశ్వరి ఆదివారం వెల్లడించారు. దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించడం ప్రమాదకరమని, కొండ ప్రాంతంలో మరింతగా నేల కోతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా తెల్లవారుజామున ట్రెక్కింగ్‌కు వెళ్లే పర్యాటకులకు తగినంత వెలుతురు, లైటింగ్ సదుపాయాలు లేకపోవడం కూడా భద్రతాపరమైన ఆందోళనలకు కారణమని వివరించారు.
ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు. పనులు పూర్తయ్యే వరకు పర్యాటకులు వంజంగి హిల్స్ సందర్శనకు రావొద్దని, అధికారులకు సహకరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు తుపాను ప్రభావంతో ఈ ప్రాంతంలోని కొన్ని రిసార్టులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. మరమ్మతు పనులు పూర్తయి, పరిస్థితులు అనుకూలించిన తర్వాతే పర్యాటకులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
also read: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ రాజీనామా!
