-
కాంగ్రెస్ శ్రేణులకు ఇదో విధేయ పరీక్ష
-
నేతల చేతులు పుస్తకం
-
సోషల్ మీడియాలో సెల్ఫీలతో కలకలం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయం సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం చుట్టూ తిరుగుతోంది. ఆమె రాసిన జీవిత చరిత్ర పుస్తకం : ఏ జర్నీ ఆఫ్ లవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విధేయత పరీక్షగా మారింది. నవంబర్ 10న 544 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఈ పుస్తకాన్ని కొనని వారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలే కారు అన్నట్టుగా పార్టీలో ఒక వాతావరణం కనిపిస్తోంది. సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకొని పీసీసీ అధ్యక్షులు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని.. ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. అధిష్టానం దృష్టిలో పడేందుకు పోటీ పడుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల వంటి నేతలు స్వయంగా సోనియా సంతకం చేసిన కాపీని అందుకుని.. ఇది నా జీవిత కాలపు అపురూప జ్ఞాపకం అంటూ పోస్టులు పెట్టారు. తెలంగాణ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏకంగా ఈ పుస్తకం ఆధారంగా సోనియా గాంధీ బయోపిక్ తీస్తానని ప్రకటించారు.
పుస్తకాల అమ్మకాలు…
హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వేదిక వద్ద ఈ పుస్తకాలు విక్రయాలు, ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్న ఈ సదస్సు ప్రాంగణంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి.. హాజరైన ప్రతి ఒక్కరికి పుస్తకాన్ని కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తున్నారు. సదస్సుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు పుస్తకాలను కొనుగోలు చేసి.. అక్కడికక్కడే సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మార్కెటింగ్ వ్యూహం…
సోనియా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించి.. ఈ పుస్తక విక్రయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, పబ్లిషర్లు అనుసరిస్తున్న మార్కెటింగ్ వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి రాజకీయ ఆత్మకథలు బుక్ స్టోర్లు లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో మాత్రమే అందుబాటులోకి ఉస్తారు. కానీ ఈసారి ఏకంగా బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ యాప్‌లలో ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచారు. ఎమ్మార్పీ ధరను 1300 గా నిర్ధారించారు. అయితే హార్డ్ కవర్ పుస్తకాన్ని క్లిక్ కామర్స్ సైట్లలో ఏకంగా 450 రూపాయల తగ్గింపుతో అందిస్తున్నారు. కేవలం పది నుంచి 20 నిమిషాల్లో ఇంటి వద్దకే డెలివరీ చేస్తుండడంతో సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ క్రియేట్ అవుతుంది.
