క్రైమ్ మిర్రర్ : దేశ భద్రతను విస్మరించి, శత్రు దేశానికి గోప్యమైన సమాచారాన్ని చేరవేసిన భారత వైమానిక దళ (IAF) వింగ్ కమాండర్ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. పాకిస్థానీ గూఢచారి పన్నిన హనీట్రాప్ వలలో పడిన సదరు అధికారి, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా లీక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
పాకిస్థాన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఓ యువతి పంపిన అసభ్య చిత్రాలు, సందేశాలకు ఆకర్షితుడైన వింగ్ కమాండర్ ఆమెతో టచ్‌లోకి వెళ్లారు. ఈ ఏడాది జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు వాట్సాప్ వేదికగా వీరిద్దరి మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరిగింది.
లీకైన రహస్యాలు: భారత వైమానిక దళానికి సంబంధించిన వ్యూహాత్మక యుద్ధ ప్రణాళికలు, డ్రోన్ల పనితీరు, యుద్ధ విమానాల మోహరింపు తీరు, కీలక సైనిక స్థావరాల వివరాలను ఆ యువతికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
మాల్వేర్ దర్యాప్తు: కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా, తన కింద పనిచేస్తున్న మరో ఐదుగురు అధికారుల ఎలక్ట్రానిక్ పరికరాలలో మాల్వేర్, స్పైవేర్లను ఇన్స్టాల్ చేయడంలోనూ వింగ్ కమాండర్ సహకరించినట్లు తేలింది.
డిజిటల్ ఆధారాలు: నిందితుడి ఫోన్లోని వాట్సాప్ డేటాను విశ్లేషించగా.. 3,008 టెక్స్ట్ మెసేజ్‌లు, 65 ఫొటోలు, 42 వాయిస్ కాల్స్, 4 వీడియో కాల్స్, కొన్ని యూఆర్ఎల్లు షేర్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు.
గతంలో కార్యాలయంలోకి స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తున్న సమయంలో భద్రతా సిబ్బంది జరిపిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దేశ రక్షణ రంగానికి చెందిన అత్యున్నత స్థానంలో ఉండి, ఇలాంటి దేశద్రోహానికి పాల్పడటం రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
also read : కళ్లముందే బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. ఆ షాక్‌ను తట్టుకోలేక గర్ల్‌ఫ్రెండ్ కూడా బలవన్మరణం
