కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీసిన విషాద ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సంతానం కలగలేదనే కారణంతో భర్త తరచూ అవమానిస్తూ, మానసికంగా వేధిస్తుండటంతో భార్య తీవ్ర ఆగ్రహానికి గురై అతడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కెంపేగౌడనగర పరిధిలోని లక్ష్మీపురకు చెందిన రాజశేఖర్ (32), మాలాశ్రీ (30) దంపతులు. వీరికి వివాహమై చాలా సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ రాజశేఖర్ తరచూ భార్యను అవమానించేవాడని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో ఆమెతో గొడవపడుతూ ‘గొడ్రాలు’ అంటూ దూషించేవాడని సమాచారం.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మాలాశ్రీ వంటగదిలో ఉన్న కత్తితో రాజశేఖర్‌పై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మాలాశ్రీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
also read: డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. నారాయణపేట జిల్లాలో విషాదం
