దేశ రాజధాని ఢిల్లీలో అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తీవ్రతకు కారు ఇంజిన్ వాహనం నుంచి విడిపోయి కొంత దూరంలో పడిపోవడంతో పాటు మంటలు కూడా చెలరేగాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన యువకుడిని బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అభినవ్ సింగ్‌గా గుర్తించారు. గురుగ్రామ్‌లో నివసిస్తున్న అతడు లూధియానా నుంచి తిరిగి వస్తున్న సమయంలో శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన టన్నెల్లో వాహనాల గరిష్ఠ వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే. అయితే అభినవ్ దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి మరో కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే అభినవ్ తన కారు స్పీడోమీటర్‌ను ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి స్నాప్‌చాట్ ద్వారా స్నేహితులకు పంపినట్లు గుర్తించారు. ఈ డిజిటల్ ఆధారాలను పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు టన్నెల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారు అత్యంత వేగంతో దూసుకొచ్చి, ఎన్‌హెచ్-48కు అనుసంధానించే మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. ఢీకొన్న వేగానికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాల కారణంగా అభినవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
also read: ఏఐ దిగ్గజాలకు షాక్.. చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ అభివృద్ధిని నిలిపివేయాలంటూ పిటిషన్!
