క్రైమ్ మిర్రర్ : జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్వో) రాజశేఖర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. క్యాటరింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో డీవైఎస్వోతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్‌ను కూడా అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా స్థాయిలో నిర్వహించిన యువజన, క్రీడా కార్యక్రమాలకు క్యాటరింగ్ సేవలు అందించిన నిర్వాహకులు తమకు రావాల్సిన బిల్లుల మంజూరు కోసం డీవైఎస్వో కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే బిల్లులకు సంబంధించిన చెక్కులు జారీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని క్యాటరింగ్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం డీవైఎస్వో రాజశేఖర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read : పోలింగ్ విధుల్లో అధికారిణి కన్నుమూత.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో హైటెన్షన్
