Homeఆంధ్ర ప్రదేశ్పోలింగ్ విధుల్లో అధికారిణి కన్నుమూత.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో హైటెన్షన్

పోలింగ్ విధుల్లో అధికారిణి కన్నుమూత.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో హైటెన్షన్

క్రైమ్ మిర్రర్ : అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి గుండెపోటుతో మృతి చెందారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద పలుచోట్ల రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు ఎన్నికల వేళ కలకలం రేపాయి.

ఎన్నికల విధుల్లోనే గుండెపోటు.. అధికారిణి మృతి

అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఏపీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హరిత గౌడ్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కూడేరు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. హరిత గౌడ్ రాయదుర్గంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిణి ఆకస్మిక మరణంతో సహచర సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.

కళ్యాణదుర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పిట్లంపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 3 వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటు వేసే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందిన వారు ఒకేసారి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎన్నికల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. అనంతరం కేంద్రానికి తాళం వేసి పరిస్థితిని సమీక్షించారు. సుమారు గంటపాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ ఘటనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విచారణ చేపట్టి ఇరువర్గాల నాయకులతో మాట్లాడారు. అయినప్పటికీ మరోసారి కొందరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రూరల్ సీఐ గంగాధర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.

నెల్లూరు జిల్లాలోనూ రాజకీయ వర్గాల మధ్య వాగ్వాదం

మరోవైపు నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రభుత్వ పాఠశాల వద్ద కూడా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థులు ఉన్నారంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ.. అదే కేంద్రంలో మీ పార్టీకి చెందిన వారు ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మరింత పెరిగి తోపులాటకు దారితీసింది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఒకవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిణి మృతి చెందగా, మరోవైపు పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది.
also read : ఏపీలో మరో డీఎస్సీ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు