ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్కూల్ యూనిఫాంలోనే ఓ చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఇంటర్ చదువుతున్న బాలుడు, బాలిక తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలు సమీపంలోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మరోవైపు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థులు కలిసి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థిని మృతదేహం సమీపంలో రక్తపు మరకలు కనిపించడంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి.
తన సోదరిపై అత్యాచారం చేసి హత్య చేశారని విద్యార్థిని సోదరుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశాడు. అయితే ఇద్దరు విద్యార్థుల మృతికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికితీయాల్సి ఉంది.
also read: పోలీస్ స్టేషన్లోనే మహిళపై అత్యాచారం.. 15 మంది పోలీసులు సస్పెండ్!
