-
టిడిపి కూటమి వర్సెస్ వైసిపి
-
మేయర్ పదవి ప్రతిష్టాత్మకం
-
కూటమి వైపే కనిపిస్తున్న మొగ్గు
-
గ్రౌండ్ రిపోర్ట్ అదే…
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తోంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ మేయర్ స్థానానికి పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో మేయర్ పదవిని దక్కించుకునేందుకు అధికార కూటమి, విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని శాసించే ఈ ఎన్నికల్లో ప్రధానంగా టిడిపి కూటమి, వైసిపి మధ్య ద్విముఖ పోటీ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ లు సైతం బరిలో ఉన్నారు. అయితే టిడిపి కూటమి వైపే మొగ్గు కనిపిస్తోంది. ఆ పార్టీకి ఉన్న సంస్థ గత బలం, మూడు పార్టీల మధ్య సమన్వయం కలిసి వచ్చేలా ఉంది.
మహిళా రిజర్వేషన్ కావడంతో…
మహిళలకు రిజర్వు కాబడిన మేయర్ స్థానానికి కూటమి అభ్యర్థిగా టిడిపికి చెందిన కోవెలమూడి లక్ష్మి అపర్ణ బరిలో నిలిచారు. వైసీపీ తరఫున తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థి లక్ష్మి అపర్ణకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. నగరంలో వ్యాపారాలతో పాటు విద్యారంగాలలో కూడా లోతైన అనుబంధం ఉంది. నగర టిడిపిలో ఆది నుంచి క్రియాశీలకంగా ఉన్న కోవెలమూడి కుటుంబానికి నగరవ్యాప్తంగా ఉన్న విస్తృత పరిచయాలు,క్లీన్ ఇమేజ్ ఉండడంతో ప్రజల్లోకి బలంగా దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి తాడికొండ శ్రీదేవికి కూడా నగరంలో నిర్దిష్ట సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉంది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచలుగా ఎదిగిన ఆమె.. నగరంలోని సంప్రదాయ వైసిపి ఓటు బ్యాంకును, మహిళా సాధికారత అంశాన్ని నమ్ముకుని ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
సానుకూల అంశాలు అవే…
కూటమి అభ్యర్థికి చాలా రకాల సానుకూల అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికార బలం, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలతో ఉన్న సమన్వయం అతిపెద్ద అడ్వాంటేజ్. అమరావతి రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం, నగర రహదారుల మరమ్మత్తులు వంటివి కలిసివచ్చే అంశం. అయితే కార్పొరేటర్ల సీట్ల కేటాయింపులు జనసేనతో వచ్చిన చ ఇబ్బందులు, అసంతృప్తులు డ్యామేజ్ కలిగించే విషయాలు. నగర ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడంలో బిజెపి కూటమి నేపథ్యం సృష్టిస్తున్న సవాళ్లు అవాంతరాలుగా మారాయి. వైసిపి అభ్యర్థి శ్రీదేవికి నగరంలో ఎస్సీలతో పాటు ముస్లిం మైనారిటీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిసి వచ్చే అంశాలు. అయితే పార్టీలో అగ్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారానికి పూర్తిస్థాయిలో రాకపోవడం, క్యాడర్లో నిస్తేజం అతిపెద్ద ప్రతిబంధకంగా మారాయి.
అమరావతి సెంటిమెంట్…
గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి సెంటిమెంట్ బలంగా శాసిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాజధాని లేక, అభివృద్ధి ఆగిపోయి గుంటూరు నగరం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్న భావన వ్యాపార, మధ్యతరగతి వర్గాల్లో బలంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణం పై పెట్టిన దృష్టి.. గుంటూరు రియల్ ఎస్టేట్, వ్యాపార వర్గాల్లో జోష్ నింపింది. దీనికి తోడు గత మున్సిపల్ పాలకవర్గంపై నగర ప్రజల్లో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, పన్నుల ధారాల అసంతృప్తి నేటికీ చెరిగిపోలేదు. ఫలితంగా పట్టణ ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా కూటమి అభివృద్ధి అజెండా వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. పైగా నగరంలో దాదాపు 65 శాతానికి పైగా ఉన్న బీసీ, కమ్మ, వైశ్య, కాపు వర్గాల ఓటర్లు దాదాపు ఏకపక్షంగా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై ఓటమి అభ్యర్థి కోవెలమూడి లక్ష్మి అపర్ణ కే దాదాపు 65 నుంచి 70% మేర స్పష్టమైన విజయావకాశాలు కనిపిస్తుండడం విశేషం.
ఇవి కూడ చదవండి:
-
సారా అలీ ఖాన్కు మద్దతుగా స్వామి చిదానంద.. ఫత్వాపై తీవ్ర అభ్యంతరం!
-
చిత్ర పరిశ్రమలో విషాదం… సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..
-
డీఎస్పీ భారీ ప్రయోగం..100 మంది జానపద కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ సిద్ధం!
-
లండన్లో చదువుకుంటోందనుకున్న తల్లిదండ్రులు.. పుణే ఫ్లాట్లో కుమార్తె శవం!
