-
స్థానిక ఎన్నికలవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. స్థానిక ఎన్నికలవేళ ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. దీంతో బొత్స శిబిరంలో మరో వికెట్ పడినట్లు అయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చిన్న శ్రీను ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన సమీప బంధువు, సొంత బావ అయిన బడ్డుకొండ అప్పలనాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడినట్టే. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.
బొత్స కుటుంబంలో చీలిక…
బొత్స కుటుంబంలో అడ్డగోలు చీలిక కనిపిస్తోంది. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు బడ్డుకొండ అప్పలనాయుడు. ఆయన స్వయాన బొత్స మేనకోడలు, చిన్న శ్రీను చెల్లెలు భర్త. కొద్ది రోజుల కిందటే చిన్న శ్రీను తో పాటు బడ్డుకొండ అప్పలనాయుడు కోడలు సిరి సహస్ర సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. అయితే ఆ సమయంలో వైసీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అప్పలనాయుడును తప్పించారు ఆ పదవి నుంచి. అంతటితో ఆగకుండా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసినప్పటికీ.. అనుమానంతో తనపై వేటు వేయడం పై అప్పలనాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వైఖరి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జిల్లా వ్యాప్తంగా క్యాడర్ సైతం…
తాజాగా ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున టిడిపిలో చేరడం విశేషం. స్థానిక ఎన్నికల సమయంలోనే ఈ పరిణామం జరగడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన చిన్న శ్రీను.. ఆ వెంటనే ఆయన వియ్యంకుడు అప్పలనాయుడు ఇద్దరు టిడిపి పంచన చేరడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ కలిగిన ఇద్దరు కీలక నేతలు వైదొలగడంతో.. బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది.
ఇవి కూడ చదవండి:
- ఏపీకి రెండు కేంద్ర బృందాలు.. తుపాను నష్టం, కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన!
-
బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.. డబ్బులు కట్టకపోగా ఆయనే తీసుకున్నారట!
-
హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. జలమయమైన రహదారులు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!
-
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!
