క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయా? సరైన అభ్యర్థుల పార్టీకి లభించడం లేదా? పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ప్రధానంగా నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల స్థానానికి బిజెపి అభ్యర్థి లేకుండా పోయారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు నేతలు జంకుతున్నారు. అగ్ర నేతలు సైతం బరిలో నిలిచేందుకు విముఖత చూపుతున్నారు. గతంలో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసిన వారు సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం పై మాత్రం ఆసక్తి చూస్తున్నారు. ఈ స్థానంతో పోల్చితే నల్గొండ వరంగల్ ఖమ్మం సీటు విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారు.
కాంగ్రెస్ దూకుడు…
అధికార కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. అటు గులాబీ పార్టీ సైతం సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తోంది. ఈ త్రిముఖ పోరులో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదని బిజెపి నేతలు భావిస్తున్నారు. పైగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేసరికి ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేతలు వెనక్కి తగ్గుతున్నారు. క్షేత్రస్థాయిలో అనుకున్నంత బలం లేదు ఆ పార్టీకి. అందుకే నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో పార్టీకి మంచి పట్టు ఉంది. అక్కడ నెగ్గుకు రాగలమన్న ఆశ ఉంది. అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయంలో మాత్రం నేతలు అస్సలు ముందుకు రావడం లేదు. పార్టీకి ఇది ఇబ్బందికరమే.
వరుసగా ఎన్నికల సవాల్…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టాలన్నది బిజెపి ప్రణాళిక. కానీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లతో పాటు ఖైరతాబాద్ ఎన్నిక ఆ పార్టీకి సవాల్. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ గెలుపు మాట పక్కన పెడితే.. కనీసం బిజెపి ఉనికి చాటుకో గలదా అనేది ఒక ప్రశ్న. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే సమయంలో పార్టీ చాలా దూకుడుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ ఊపు కూడా కనిపించడం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్టీ ఎంపీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. కానీ ఇక్కడ సమన్వయం అనేది కనిపించడం లేదు. మరోవైపు గ్రేటర్ ఎన్నికలు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తో పాటు ఖైరతాబాద్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తేనే బిజెపికి అనుకూలం. లేకుంటే ప్రతికూలత తప్పదు.
